ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా సాగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం పాక్షిక విజయం సాధించినట్లు కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ నుంచి వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందు నుంచి ఉన్న ఉక్కు విస్తరణ ప్రాజెక్టు నుంచి ప్రపంచ ఉక్కు దిగ్గజాల్లో ఒకటైన దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ తప్పుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఒడిశాలో ఎదురైన చేదు అనుభవాలు, విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాలు పోస్కోను వెనక్కి తగ్గేలా చేశాయి. దాంతో విశాఖకు బదులు గుజరాత్ లోని ముంద్రాలో ఆదానీ గ్రూప్ తో కలిసి గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
విశాఖ ఉక్కు విస్తరణ ప్రాజెక్ట్ కు గతంలో ఒప్పందం
ప్రపంచ స్థాయిలో మంచి పేరున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా రూ. 52 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు 2019 జూలైలో కొరియాకు చెందిన పోస్కో ముందుకొచ్చింది. ఆ మేరకు విశాఖ ఉక్కు మాతృ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ తో అదే ఏడాది ఆక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. స్టీల్ ప్లాంటుకు సమీపంలోనే గంగవరం పోర్టు ఉండటం, రైల్, రోడ్డు కనెక్టివిటీ తదితర మౌలిక వసతులు పుష్కలంగా ఉండటం, అన్నింటికీ మించి స్టీల్ ప్లాంటుకు చెందిన 22 వేల ఎకరాలు అందుబాటులో ఉండటంతో ఆ భూముల్లో గ్రీన్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. పలుమార్లు పోస్కో అధికార బృందాలు ప్లాంటును సందర్శించాయి కూడా.
అప్పట్లోనే విస్తరణ పేరుతో ప్లాంట్ భూములను పోస్కోకు అప్పగించడాన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈలోగా 2020 జనవరిలో విశాఖ ఉక్కులో తనకున్న వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుని ప్రైవేటుకు ధారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉక్కు పరిరక్షణ ఉద్యమం పురుడు పోసుకుంది.
ఒడిశా చేదు అనుభవం నేపథ్యంలో..
విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం నానాటికీ తీవ్రతరం కావడం.. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుండటంతో పోస్కో యాజమాన్యం పునరాలోచనలో పడింది. ఇంతకుముందు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదుర్కొంది. 2005లో ఒడిశాలోని జగత్సింగ్ పూర్ జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో పోస్కో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరగడం, పర్యావరణ అనుమతులు రాకపోవడం వంటి కారణాలతో ఆ ప్రతిపాదనను రద్దు చేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు విశాఖలోనూ ఉద్యమాలు తీవ్రస్థాయిలో జరుగుతుండటంతో పోస్కో విశాఖ ఉక్కు విస్తరణ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీన్నే ఆదానీతో కలిసి ముంద్రాలో ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటోంది.