జీఎస్పీసీ (గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్) పరిహారాన్ని బాధిత మత్స్యకారులకు ఈ నెల 21న అందివ్వనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని సుమారు 17,550 మంది మత్స్యకారులకు ఏడు నెలల కాలానికి పరిహారం రూ.80 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తం ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ జగన్ దృష్టికి తెచ్చారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇటీవల ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ పరిహారాన్ని ముమ్మిడివరంలోనే సీఎం చేతులు మీదుగా పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం ముమ్మిడివరం వచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదించిన క్రమంలో వచ్చే నెల 21న ముహూర్తంగా నిర్ణయించారు.