అతని ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు.. అతనితో ఒక్క మాటైనా మాట్లాడలేదు.. కనీసం ఆ మనిషి ఎలా ఉంటాడో కూడా చూడనైనాలేదు. అతన్ని పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పడమే పాపం అన్నట్లు.. దాన్నే వేధింపులని ప్రతిపక్ష టీడీపీ నేతలు చిత్రీకరిస్తున్నారు. ఒక వ్యక్తి మరణాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదులు, పోలీసుల వేధింపుల వల్లే తమ పార్టీ కార్యకర్త మృతి చెందాడని శ్రీకాకుళం జిల్లా పలాసలో శవ రాజకీయం చేయడం తెలుగుదేశం దిగజారుడు తనానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కోన వెంకటరావు (38) పురుగుమందు తాగి మృతి చెందాడు. అంతకు ముందు ఆయనపై టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదుకావడం, పోలీసులు అతని ఇంటికి వెళ్లి పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పడమే పెద్ద తప్పు అయినట్లు.. ఆ వ్యక్తి మరణానికి అదే కారణమైనట్లు టీడీపీ నేతలు ధర్నా పేరుతో రచ్చ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన కోన వెంకటరావు తమ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలపై అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆయన దాన్నే వేదికగా చేసుకుని సీఎం జగన్ నుంచి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలపై అసభ్య పదజాలంతో దూషణలు, బెదిరింపులతో కూడిన పోస్టింగులు తరచూ పెడుతుండేవాడు. ఇక స్థానిక నేతలనైతే ఎదురుపడినప్పుడల్లా దూషించేవాడు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను చంపేస్తామని ఒక ఫోన్ సంభాషణలో హెచ్చరించాడు. దానికి సంబంధించిన ఆడియో లభించడంతో దాని ఆధారంగా టెక్కలి స్టేషన్లో వెంకటరావుపై ఫిర్యాదు చేశారు. దాన్ని నమోదు చేసుకున్న పోలీసులు మందస పోలీసుల సాయంతో పొత్తంగిలోని వెంకటరావు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేడు. ఇచ్ఛాపురం వెళ్లాడని అతని భార్య చెప్పగా.. వెంకటరావు వస్తే టెక్కలి స్టేషన్ కు రమ్మని చెప్పి పోలీసులు వెళ్లిపోయారు. కాగా ఇచ్ఛాపురం వెళ్లిన వెంకటరావు మరునాడు ఉదయం తన పొలంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన కుటుంబసభ్యులు పలాస ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దాంతో మందస పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
టీడీపీ నేతల హైడ్రామా
వెంకటరావు మరణం గురించి తెలుసుకున్న టీడీపీ నేతలు వెంటనే రాజకీయం మొదలుపెట్టారు. హడావుడిగా మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, పలాస ఇంఛార్జి గౌతు శిరీష తదితరులు పలాస ఆస్పత్రికి చేరుకుని ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు వేధింపులకు గురిచేయడం వల్లే తమ కార్యకర్త మృతి చెందాడని ఆరోపిస్తూ హైడ్రామా చేసి, ఉద్రిక్తతలు సృష్టించారు. పొంతనలేని పరస్పర విరుద్ధ ఆరోపణలు చేస్తూ.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పలాస ఆస్పత్రి వద్ద ధర్నా చేసిన నేతలు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతోనే పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, దాంతో మనస్తాపానికి గురైన వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేధింపుల వల్లే తమ కార్యకర్త చనిపోయాడని ఆరోపించడం గమనార్హం. అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండానే రాజకీయం కోసం ఆరోపణలు గుప్పించారని దీంతో అర్థం అవుతోంది.
నా హత్యకు అచ్చెన్న కుట్ర:దువ్వాడ
వెంకటరావు మృతి విషయం టీడీపీ విషప్రచారాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ హత్యారాజకీయాలను అడ్డుకుంటున్నాననే కక్షతో అచ్చెన్నాయుడే ఈ రాజకీయ డ్రామా ఆడిస్తున్నారని ఆరోపించారు. తనను హత్య చేయించేందుకు అచ్చెన్న కుట్ర పన్నారని, దానికి వెంకట్రావును పావుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ రహస్యం బయటపడటంతోనే వెంకట్రావును చంపించి.. దాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు కుటుంబాల ఆగడాలను అడ్డుకుంటున్నానన్న కక్షతో, వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తానన్న భయంతో అచ్చెన్నాయుడు తన హత్యకు పన్నాగం పన్నారని చెప్పారు. అచ్చెన్న స్వగ్రామం నిమ్మడ సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఏడుగురిని ఆ కుటుంబం హతమార్చిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో తనపై కూడా 19 తప్పుడు కేసులు బనాయించి వేధించారన్నారు.
మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున నిమ్మడలో పోటీ చేసిన కింజరాపు అప్పన్నకు నాలుగురోజుల క్రితం కోన వెంకట్రావు ఫోన్ చేసి ‘అచ్చెన్నాయుడు బంధువైన నువ్వు దువ్వాడ వెనుక ఉండటమేమిటి అని ప్రశ్నిస్తూ.. అతన్ని ఏడాదిలో చంపేస్తామని’ చెప్పాడని దువ్వాడ వివరించారు. దానికి సంబంధించిన ఆడియోని వినిపించారు. దాంతో వెంకట్రావుపై అప్పన్న టెక్కలి స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. అంతే తప్ప వెంకట్రావు ఎవరో తనకు తెలియదన్నారు. హత్య కుట్ర బయటపడటంతో, పూర్తి వివరాలు బయటకు వచ్చేస్తాయన్న భయంతో అచ్చెన్నాయుడే వెంకట్రావును హత్య చేయించి.. తనపైకి నెట్టేయాలని చూస్తున్నారని దువ్వాడ ఆరోపించారు. ఈ కేసులో మొదట అచ్చెన్నాయుడిని విచారిస్తే అసలు గుట్టు బయటపడుతుందని ఆయన అన్నారు.
67300