మనది ప్రజాస్వామ్యం. ప్రపంచంలో మనదే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ అనే మంచి పేరుంది. ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీలదే కీలకపాత్ర. ఎన్నికల ద్వారా ఈ పార్టీల నేతలనే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకుని చట్టసభలకు పంపుతుంటారు. పార్టీలు, వాటి నేతలు కూడా తమను ఎన్నుకునే ప్రజలు, పరిపాలన విషయంలో అంతే బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలి. ఎన్నికల పోరాటంలో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు, అభిప్రాయ బేధాలు ఉండటం చాలా సహజం. ఈ క్రమంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొత్త కాదు. కానీ ఎవరికివారు తమ పరిధిలో ఉంటూ విభేదించాల్సి ఉంటుంది.అంతేతప్ప ప్రత్యర్థి పార్టీలు తమను పల్లెత్తుమాట అనడానికి వీల్లేదని హెచ్చరించడం, అలా ఎవరైనా అంటే వారి అంతు చూస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అసహనానికి పరాకాష్ట. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇదే తీరులో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలకు గురవుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అంతు చూసేందుకు ఆత్మాహుతి (సూసైడ్ బ్యాచ్) సిద్ధం చేశామని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని తీవ్రవాద పార్టీగా మార్చేస్తున్నారేమోనన్న అనుమానాలను, ఆందోళనను కలిగిస్తున్నాయి.
విచక్షణ కోల్పోయి తీవ్రవాద ధోరణి..
టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న రెచ్చిపోయారు. తాను ప్రజాస్వామ్యంలో ఉన్నానని, రాజకీయ పార్టీ నేతనన్న విచక్షణను కోల్పోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా చెత్త వాగుడు వాగే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. అందుకోసమే 100 మందితో సూసైడ్ బ్యాచ్ (ఆత్మాహుతి దళం) సిద్ధం చేశామని ప్రకటించారు. చంద్రబాబు కోసం ఎదుటివారిని చంపడానికైనా.. చావడానికైనా ఈ బ్యాచ్ సిద్ధమేనని అన్నారు. చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని తిడితే, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తే ప్రభుత్వ పదవులు వస్తాయని వైఎస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారని, ఇటీవలి పదవుల పంపకంలో అటువంటి వారికే పదవులు ఇచ్చారని వెంకన్న ఆరోపించారు. చెత్త వాగుడు కట్టిపెట్టి నోటిని అదుపులో పెట్టుకోకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు.
అసహనంతో పెరుగుతున్న తీవ్రవాద ధోరణి
ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి అయ్యి రాజకీయ నిరుద్యోగిగా మారిన బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వార్తల్లో ఉండవచ్చన్న దుగ్ధతో, చంద్రబాబు మెప్పు పొందవచ్చన్న ఆశతో పెట్రేగిపోతున్నారు. అసహనంతో విచక్షణ కోల్పోయి తీవ్రవాద ధోరణిలోకి వెళ్లిపోతున్నట్లుంది. రాజకీయాల్లో అభిప్రాయ బేధాలు, సిద్ధాంతాలను పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తమ అభిప్రాయాలను వెల్లడించాలి, ఎదుటివారి వాదనలను ఖండించాలి. హింస, ప్రతీకారేచ్ఛకు అసలు తావులేదు. ఉంటే అది రాజకీయ పార్టీ అనిపించుకోదు. ఆ పార్టీ నేతలు రాజకీయవేత్తలు అనిపించుకోరు. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలు ఇటువంటి ధోరణితో ఉంటాయి. చంపు లేదా చావు అన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటాయి. తమ శత్రువులను అంతమొందించేందుకు ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేస్తుంటాయి. సమాజానికి ప్రమాదకారి అయిన ఈ ధోరణితో ఉన్నందునే ఉగ్రవాద సంస్థను ప్రభుత్వాలు నిషేధిస్తుంటాయి. మరి 40 ఏళ్ల ఘనచరిత్ర ఉందని చెప్పుకుంటున్న తెలుగుదేశంలోనూ ఆత్మాహుతి దళం సిద్ధం చేశామని బుద్దా వెంకన్న ప్రకటించారంటే ఆ పార్టీని కూడా తీవ్రవాద పార్టీగా మార్చేస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలుసా? ఆయన అనుమతితోనే బుద్దా వెంకన్న ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశారా?.. అదే జరిగి ఉంటే టీడీపీని తీవ్రవాద పార్టీగా పరిగణించి నిషేధించాల్సి ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విమర్శలు చేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్న బుద్దా వెంకన్న తాను ఏమైనా మడికట్టుకుని కూర్చుంటున్నారా? తెల్లవారి లేచింది మొదలు సీఎం జగన్ తో సహా వైఎస్సార్సీపీ నేతలను నోటికొచ్చినట్లు తిట్టడమే పనిగా పెట్టుకుంటున్న బుద్దా వెంకన్నను ఏం చేయాలి.. ఇలా ప్రత్యర్థులు తిడుతున్నారంటూ.. ప్రతి పార్టీ ఆత్మాహుతి దళాలను పెంచి పోషిస్తూ హింసను ప్రేరేపిస్తే పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందో ఆలోచించాల్సిన పని లేదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా బుద్దా వ్యాఖ్యలను టీడీపీ వర్గాలు ఖండిస్తున్నాయి. ఇటువంటి దుందుడుకు వ్యాఖ్యలు, చర్యలు అంతిమంగా టీడీపీకే ఆత్మహత్యాసదృశంగా పరిణమిస్తాయని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
72800