ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చేజిక్కించుకునేందుకు బడా కార్పొరేట్ సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈ ఫ్యాక్టరీలో వందశాతం పెట్టుబడులను స్ట్రాటజిక్ సేల్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి బిడ్లు ఆహ్వానించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏడాదికి పైగా ఉక్కుపరిరక్షణ ఉద్యమం నిర్వహిస్తున్నారు. రకరకాల మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రైవేటీకరణ ప్రక్రియతో ముందుకెళుతోంది. దీంతో ఈ కర్మాగారాన్ని దక్కించుకునేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా రేసులోకి నవీన్ జిందాల్ గ్రూప్ వచ్చింది.
రేసులో పలు సంస్థలు
విశాఖ ఉక్కు నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచంలోనే పేరుప్రఖ్యాతులు పొందింది. నష్టాల సాకుతో కేంద్రప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని అమ్మివేయాలని గత ఏడాది జనవరిలో నిర్ణయించింది. ఇందుకోసం ప్రైవేట్ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ గత ఏడాది ఆగష్టులోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు ప్రపంచ ఉక్కురంగంలో దిగ్గజ సంస్థలైన దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో పాటు ఎల్ ఎన్ మిట్టల్ గ్రూప్ కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ సంస్థ, టాటా గ్రూప్ కు చెందిన టాటా స్టీల్స్ సంస్థలు ఇప్పటివరకు ఆసక్తి కనబరిచాయి. తాజాగా జిందాల్ గ్రూప్ కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) సంస్థ కూడా విశాఖ ఉక్కు కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ ఎండీ వీఆర్ శర్మ ఈ విషయాన్ని ధృవీకరించారు. బిడ్ దాఖలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే చత్తీస్గఢ్ లో ఎన్ఎండీసీ 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారాన్ని కూడా తీసుకోవడానికి తమ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు.
ఆకర్షిస్తున్న విశాఖ ఉక్కు విశిష్టతలు
విశాఖ ఉక్కు కోసం దిగ్గజ సంస్థలు పోటీ పడటానికి దాని విశిష్టతలే కారణం. దేశంలో సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖస్టీల్. ఇప్పటికీ దీని ఉత్పత్తులు నాణ్యతలో ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఈ కర్మాగారానికి రైలు, రోడ్డు, జల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు కర్మాగారం విస్తరణ కార్యకలాపాలకు వీలుగా సుమారు 22 వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాంటును చేజిక్కించుకుంటే ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉక్కు వ్యాపార విస్తరణకు మార్గం సుగమం అవుతుంది. ఇవన్నీ ప్రైవేట్ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ప్లాంట్ ను కాపాడుకునేందుకు జరుగుతున్న ఉక్కు పరిరక్షణ ఉద్యమం వీరి ప్రయత్నాలకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.
65964