ప్రజాస్వామ్యం అనే బండికి అధికారపక్షం, ప్రతిపక్షం రెండు చక్రాల్లాంటివి. ఆ రెండూ బలంగా ఉంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థ పది కాలాలపాటు వర్ధిల్లుతుంది. అందువల్ల కాంగ్రెస్ మళ్లీ బలపడాలని కోరుకుంటున్నాను.అది బలహీనపడటం వల్ల ప్రాంతీయపార్టీలు దానిస్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. అని కేంద్రమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు అవకాశం ఇస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చేలా ఉన్నా.. ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను అణగదొక్కి అధికారం అందుకోవడమే ఏకైక లక్ష్యంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అప్పట్లో వాజపేయి ఓడిపోయినా నెహ్రూ గౌరవించారంటే.. గతంలో పార్టీలు విలువలు,సిద్ధాంతాలు పాటించేవి.విభేదాలు ఉన్నా పరస్పరం గౌరవించుకునేవి. ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించదు. అధికారం అనే ఏకైక అజెండాతో ప్రధానపార్టీలు పనిచేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ ఎలా చేశామని కాదు.. అధికారంలోకి వచ్చామా లేదా అన్నదాన్నే ప్రామాణికంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి.
2014లో మోడీ-షా ద్వయం బీజేపీ, ఎన్డీయే నాయకత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని అందుకున్నారు. రాష్ట్రాలలోనూ, దేశంలోనూ కాంగ్రెసును అధికారం నుంచి దూరంచేసి బలమైన ప్రతిపక్షం లేకుండా చేసుకోవడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తులు, ఎత్తులు, చీలికలు, పార్టీ మార్పిడులు, అధికార బలం.. ఇలా అన్ని మార్గాల్లోనూ ప్రతిపక్షం అన్నది లేకుండా అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. సొంత పార్టీయే ఇటువంటి విధానాలు అనుసరిస్తుంటే.. గడ్కరీ కాంక్షిస్తున్న బలమైన ప్రతిపక్షం ఎలావస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అధికారమే ప్రధాన ఎజెండా
కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో అధికారమే లక్ష్యంగా బీజేపీ గత ఎనిమిదేళ్లుగా పనిచేస్తోంది. కాంగ్రెసును ఏదోక విధంగా బలహీనపరచడం, అధికారం చేజిక్కించుకోవడమే ధ్యేయంగా రాష్ట్రాల్లో సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తోంది. పార్టీ మార్పిడులను ప్రోత్సహించడం, చరిష్మా ఉన్న ముఖ్యమైన నేతలను లాక్కోవడం వంటి చర్యల ద్వారా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసు నుంచి అధికారాన్ని గుంజుకున్న చరిత్ర బీజేపీది.
మధ్యప్రదేశ్లో 2018లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీకి చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సిందియాను తనవైపు తిప్పుకుని ఆయన వర్గానికి చెందిన పాతికమంది ఎమ్మెల్యే లతో చీలిక ఏర్పడేలా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి.. బీజేపీ సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2017లో గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా స్వతంత్రులు, ఎంజీపీ సహాయంతో గద్దె ఎక్కిన బీజేపీ..కాంగ్రెసు నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. కర్ణాటకలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అధికారంలోకి రాగా.. ఆ రెండు పార్టీలకు చెందిన 20 మందికిపైగా ఎమ్మెల్యేలను చీల్చి అధికారం అందుకుంది. ఈశాన్య రాష్ట్రాలైన అసోంలో హిమంత్ విశ్వ శర్మ, మిజోరంలో బీరెన్ సింగ్ వంటి బలమైన మాస్ ఇమేజ్ ఉన్న కాంగ్రెస్ నేతలను తనవైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో పాగా వేసింది. ఇటువంటి విధానాలు ప్రతిపక్షం, ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీలతోనే పొత్తులు
ప్రాంతీయ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలహీనపడటం వల్లే అవి పుంజుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ బలహీనపడటం ప్రాంతీయ పార్టీల పుట్టుక, మనుగడకు కారణం కాదు. జాతీయ పార్టీలుగా చెలామణీ అవుతున్న కాంగ్రెస్, బీజేపీలు జాతీయ స్థాయిలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతీయ ఆకాంక్షలను,రాష్ట్రాల ప్రధాన అవసరాలు, డిమాండ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలను సవాల్ చేయగలుగుతున్నాయి. వీటి ప్రాబల్యం వల్ల ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్, బీజేపీలు ఆ ప్రాంతీయ పార్టీలతోనే అంటకాగుతూ అధికారం కోసం అర్రులు చాస్తున్నాయి. ప్రస్తుతం అధికారం సాగిస్తున్న ఎన్డీయే కూటమిలోనే పలు ప్రాంతీయ పార్టీలు ఉన్న విషయం గడ్కరీకి తెలుసు. ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న గడ్కరీ వ్యాఖ్యలకు విరుద్ధంగా అనేక రాష్ట్రాల్లో ఆ ప్రాంతీయ పార్టీలతోనే కూటమి కట్టి బీజేపీ అధికార హోదా అనుభవిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు యూపీ, గోవా, పంజాబులో ఇదే పరిస్థితి ఉంది. ఏపీలో 2014 ఎన్నికల్లో టీడీపీతో, ప్రస్తుతం జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. తమిళనాడు, పుదుచ్చేరీల్లో ద్రావిడ పార్టీలతో చెలిమి చేస్తోంది. ఈ నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రశంసనీయమే అయినా సొంత పార్టీలోనే అవి అమలయ్యేలా చూడాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
70849