మొన్న ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో నేతలు సొంత కార్యాలయాలు తెరిచి కలకలం రేపితే.. నిన్న కేఈ కుటుంబం వచ్చే ఎన్నికల్లో పోటీపై చేసిన బహిరంగ వ్యాఖ్యలు కర్నూలు జిల్లా టీడీపీలో మరింత గందరగోళానికి దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ లేదా ఆలూరు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తానని మాజీమంత్రి కె.ఈ.ప్రభాకర్ ప్రకటించారు. ఆ రెండు నియోజకవర్గాలపై ఇప్పటికే కన్నేసిన కోట్ల కుటుంబం దీనిపై గుర్రుగా ఉంది. దీంతో దశాబ్దాలుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాల వైరం మళ్లీ తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలూరు నుంచే పోటీ చేస్తాను.. లేనిపక్షంలో పార్టీకి గుడ్ బై చెబుతానని కోట్ల సుజాత ప్రకటించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ పరిణామాలతో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఎవరికి వారుగా ప్రకటనలు
జిల్లాలో కొద్దిరోజులుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు టిడిపిని అయోమయంలోకి నెట్టేస్తోంది. మొదట ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రంలో అక్కడి పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కార్యాలయం ఉండగానే.. ఆయనతో ప్రమేయం లేకుండా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంత కార్యాలయం తెరిచారు. ఆ మారునాడే కోట్ల సుజాత ఇంఛార్జ్ గా ఉన్న ఆలూరులో 2014లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ సొంత కార్యాలయం తెరిచి కోట్ల వర్గానికి షాక్ ఇచ్చారు.
Also Read : కర్నూల్ టీడీపీలో కోట్ల సొంత కుంపటి
తాజాగా కేఈ ప్రభాకర్ రంగప్రవేశం చేశారు. ఆలూరులో పర్యటించిన ఆయన వచ్చే ఎన్నికల్లో తాను ఆలూరు అసెంబ్లీకి లేదా కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. కర్నూల్ పార్లమెంటు ఇంఛార్జిగా సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు అసెంబ్లీ ఇంఛార్జిగా ఆయన సతీమణి సుజాత ఇంఛార్జీలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ తరుణంలో ఆలూరుపై అటు వీరభద్ర గౌడ్, ఇటు కేఈ ప్రభాకర్ పోటీకి వస్తుండగా.. కర్నూల్ ఎంపీ సీటుకు కూడా కోట్లతో కేఈ పోటీకి వస్తుండటం టీడీపీలో కాక రేపుతోంది. అధిష్టానం నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారి కార్యాలయాలు తెరవడం, పోటీ చేస్తామని ప్రకటించడంతో గందరగోళం నెలకొంది.
ఒకే పార్టీలో ఉన్నా..
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా కోట్ల, కేఈ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం జరిగింది. ఒకప్పుడు కాంగ్రెసులోనే ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ మాదన్న రెండు వర్గాలను పోషించేవారు. టీడీపీ ఆవిర్భావంతో కేఈ వర్గం ఆ పార్టీలో చేరింది. దాంతో ఆ కుటుంబాల పోరు.. పార్టీల పోరాటంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేఈ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. డోన్, కోడుమూరు, పత్తికొండ తదితర నియోజకవర్గాల్లో రెండు పార్టీల తరపున హోరాహోరీగా తలపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read : పెనుకొండ ఓటమిపై బాబు సీరియస్ – అనంత నేతలకు క్లాస్
అయితే 2019 ఎన్నికలకు ముందు కేంద్రమంత్రిగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీ అధినేత పార్టీలో చేర్చుకోవడంతో ఓకే ఒరలో రెండు కత్తులన్నట్లు పరిస్థితి తయారైంది. ఆ ఎన్నికల వరకు రెండు కుటుంబాలకు చంద్రబాబు నచ్చజెప్పి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసేలా జాగ్రత్త పడ్డారు. అయితే వారందరితోపాటు, టీడీపీ కూడా రాష్ట్రంలో ఓడిపోయింది. రెండున్నరేళ్లు గడిచిపోవడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మళ్లీ కోట్ల, కేఈ కుటుంబాలు క్లాష్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.