తెలంగాణాలో రెవెన్యూ కార్యాలయాలకు పోలీసు భద్రత ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాల వద్ద పలు భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రెవెన్యూ అధికారుల సంఘం విజ్ఞప్తి మేరకు ఇలా చేస్తున్నారు.
పోలీస్ భద్రత తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఎమ్మార్వో ల చాంబర్లు కోర్టు తరహాలో ఏర్పాటు చేయాలనీ, ప్రజల రాకపోకల కు ప్రత్యేకమైన క్యూ పద్దతి అమలు చేయాలని నిర్ణయించారు.
ఇవి మార్గదర్శకాలు
– తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసే ‘గ్రీవెన్స్’కార్యక్రమం కోసం నిర్దేశిత వేళలు నిర్ధారించాలి. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది హాజరయ్యేలా చూడాలి.
– కలెక్టర్లు తమ నిధులతో వెంటనే అన్ని కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కార్యాలయంలోని అన్ని ప్రాంతాలు ఆ పరిధిలోకి వచ్చే విధంగా వాటిని అమర్చాలి.
– కొత్తగా ఏర్పాటయిన కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మౌలిక వసతుల కోసం తీసుకున్న చర్యల నివేదికను పంపించాలి.
– ముఖ్యమైన చట్టాలు, మెజిస్టీరియల్ కార్యనిర్వాహక అంశాలపై జిల్లా శిక్షణా కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి.