ఏపీలో సంచలనంగా మారిన విజయనగరం జిల్లా రామతీర్థం రాముడి గుడిలో ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న (సోమవారం) దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు రోజుల్లో రామతీర్థం ఘటనలో నిందితుల అరెస్ట్ జరుగుతుందని చెప్పారు. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతోందని, త్వరలోనే అధికారికంగా పోలీసులు వెల్లడిస్తారని చెప్పారు. అలాగే పోలీసులు కూడా 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ధ్వంసమైన విగ్రహం వెదుకులాటలో స్థానిక టీడీపీ నేతలు కొందరు కోనేరులో వెదికినట్లుగా వెదికి, అందులోంచి తల భాగాన్ని బయటకు తీయటం పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. తమదైన శైలిలో తీగ లాగితే డొంక కదులుతున్నట్లుగా తెలుస్తోంది. విచారణలో పోలీసులు పట్టు బిగుస్తున్న కొద్దీ టీడీపీ నేతల్లో కలవరం కనిపిస్తోంది.
చట్టం వదిలిపెట్టదు..
ప్రభుత్వ పథకాల్లో ఏవైనా లోపాలు దొర్లితే ఎత్తి చూపాల్సిన విపక్షం.. అటువంటివేవీ కనిపించక గుళ్లు, విగ్రహాల ధ్వంసానికి తెగబడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విపక్షం తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘‘కొట్లాటలు పెట్టడం మాని.. మంచి పనులకు సూచనలిస్తే సీఎం స్వీకరిస్తారు. కుట్రలకు పాల్పడితే తప్పించుకోలేరు.. చట్టం వదిలిపెట్టదని’’ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
చైర్మన్ అయి ఉండి ఎందుకు వెళ్ల లేదు…
రామతీర్థం పుణ్యక్షేత్రం ఆలయ ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు (ప్రస్తుతం ప్రభుత్వం తొలగించింది) వ్యవహరిస్తున్నారు. తాను చైర్మన్ గా ఉన్న గుడిలో రాముడి విగ్రహం ధ్వంసం అయినప్పుడు రాష్ట్రం మొత్తం స్పందించింది. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. కానీ ఆలయ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు వెళ్లకపోవడంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలని మంత్రి బొత్స అశోక్ గజపతి రాజును ప్రశ్నిస్తున్నారు. ‘‘చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారు?. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
అమల్లో సెక్షన్ 30
రామతీర్థం ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని డీఎస్పీ సునీల్ తెలిపారు. రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని, చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహం ధ్వంసం దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. రామతీర్థం వైపు ఎవరూ వెళ్లకుండా రాజపులోవ జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. సభలు, ర్యాలీల ద్వారా నిరసన తెలపాలంటే పోలీసుల ముందస్తు అనుమతిని తప్పనిసరి చేశారు. రామతీర్థం ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గం, కొండపైనున్న కోదండరాముని ఆలయం, కొండకు వెళ్లే ముఖద్వారం, కొండ వెనుక భాగం… ఇలా ఏ దారిలో చూసినా పోలీసుల హడావుడే కనిపిస్తోంది. బోడికొండకు సమారు 500 మీటర్ల దూరంలోనే రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు