రామతీర్థం ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామతీర్థంలో శ్రీ రాముడి విగ్రహాల ధ్వంసం ఘటనను కేంద్రంగా చేసుకుని ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీ-జనసేన సంయుక్తంగా చేపట్టిన ధర్మయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి “చలో రామతీర్థం”కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో రామతీర్థంకు ఐదు కిలోమీటర్ల దూరంలో నెల్లిమర్ల జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటుకుంటూబీజేపీ శ్రేణులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో బీజేపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది..
ఈ తోపులాటలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పృహ తప్పి పడిపోవడంతో నెల్లిమర్ల జంక్షన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా,ఎన్ని ఆంక్షలు పెట్టినా రామతీర్థం లోని రాముడి ఆలయం దగ్గరకు వెళ్లి తీరుతామని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడిని దర్శించి తీరుతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు,వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలకు రాముడి దర్శనానికి అనుమతి ఇచ్చి తమకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం ఐదుగురు బీజేపీ నేతలను కొండపైకి వెళ్లేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. కానీ బీజేపీ శ్రేణులు మొత్తాన్ని రామతీర్థం శ్రీ రాముని దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందే అని సోము వీర్రాజు పట్టుబట్టారు. దీంతో పోలీసులు సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంతో పాటు విజయనగరం డివిజన్లో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బోడికొండ మెట్ల వద్ద మరిన్ని పోలీసు బలగాలను మోహరించారు.