వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన ఈఎస్ఐ స్కాంలో ఏ3 నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత రెండు నెలలుగా పరారీలో ఉన్న పితాని సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తునే ఉన్నారు. అయితే వారి కంటపడకుండా అజ్ఞాతంలో ఉన్న పితాని సురేష్.. మరోసారి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్పిటిషన్ను హైకోర్టు కొట్టివేయగా.. రెండోసారి పిటిషన్ దాఖలు చేయడం విశేషం. పిటిషన్‌పై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఈఎస్ఐ స్కాంలో ఇప్పటికే పలువురు అధికారులు, మెడికల్ షాపుల యజమానులతో సహా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే అచ్చెం నాయుడుకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సదరు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అచ్చెం నాయుడు తరఫు న్యాయవాది.. చెల్లింపులు అధికభాగం పితాని సత్యానారాయణ మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయని, అసలు లబ్ధిదారుడు అయిన ఏ3 ని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకుండా.. తన క్లయింట్‌ను అరెస్ట్ చేశారంటూ వాదించారు. అచ్చెం నాయుడు న్యాయవాది వాదనతో.. ఈఎస్ఐ స్కాంలో భారీ అవినీతి చేటుచేసుకున్నట్లు అందరికీ అర్థం అయింది. మొత్తం మీద 76 రోజుల తర్వాత అచ్చెం నాయుడుకు బెయిల్ మంజూరైంది.
ఈ స్కాంలో పితాని మాజీ పీఎస్ మురళీని ఏసీబీ అరెస్ట్ చేసింది. మురళీ, సురేష్‌లు సంయుక్తంగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా.. మురళీని ఏసీబీ అరెస్ట్ చేసింది. పితాని సురేష్ మాత్రం తప్పించుకుతిరుగుతున్నారు. మొదటి దఫాలో ఏసీబీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. మరి ఈ సారైనా పితాని సురేష్‌కు ఊరట లభిస్తుందా..? లేదా..? వేచి చూడాలి.