కేరళ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. సహజంగా విపక్షం పక్కన నిలిచే ఓటర్లు ఈసారి భిన్నంగా వ్యవహరించారు. పాలకపక్షానికి పట్టంగట్టారు. దాంతో సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బారీ విజయాన్ని నమోదు చేసుకుంటుంది. మొత్తం 941 గ్రామ పంచాయితీ స్థానాలకు గానూ 514 చోట్ల అధికార పార్టీ హవా సాగింది. అదే సమయంలో యూడీఎఫ్ 375 చోట్ల విజయం దిశగా సాగుతుండగా, ఎన్డీయేకి కేవలం 23 స్థానాల్లో మాత్రం ఆధిక్యత దక్కింది. ఇక 6 మునిసిపల్ కార్పోరేషన్లకు గానూ కీలకమైన తిరువనంతపురం సహా 4 చోట్ల ఎర్రజెండా పట్టు నిలుపుకుంది. జిల్లా పంచాయితీలు 14కి గానూ ఏకంగా 10 చోట్ల సీపీఎం నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది. 152 బ్లాక్ పంచాయితీలలో 112 చోట్ల వామపక్షమే విజయపక్షంగా నిలిచింది.
ఇది ప్రజా విజయం అంటూ సీఎం విజయన్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి ప్రజలిచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిదన్నారు. బీజేపీ, మిత్రపక్షాలను చిత్తుగా ఓడించడం ద్వారా కేరళ ప్రజలు మతోన్మాదానికి గుణపాఠం చెప్పేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని చాటినట్టయ్యిందన్నారు.
ఈసారి ఫలితాల్లో యూడీఎఫ్ కి బలమైన కేంద్రాలుగా ఉన్న త్రిచూర్, ఎర్నాకులం, కొట్టాయం వంటి చోట్ల కూడా ఈసారి ఎల్డీఎఫ్ కి మెరుగైన ఫలితాలు దక్కాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ లెఫ్ట్ విజయకేతనం వారి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించిన చోట్ల కూడా ఈసారి కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తప్పలేదు. అదే సమయంలో బీజేపీకి కూడా గత ఎన్నికల్లో దక్కిన కొద్దిపాటి స్థానాలను కూడా నిలబెట్టుకోలేక చతికిలపడింది. ఇటీవల అనేక వివాదాలతో కేరళలో పట్టు కోసం ప్రయత్నం చేసినా కమలనాథులకు మళయాళీ ఓటర్ల నాడి పట్టుకోవడం సాధ్యం కాలేదని స్పస్టమయ్యింది.