ప్రముఖ కవి, రచయిత, వ్యాఖ్యాత, వక్త, యువ- ఆదర్శ – ఉత్తమ రైతు, సామాజిక వేత్త ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పేరు ముందు ఇంకెన్ని చేర్చాలో? వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మంచిపేరు తెచ్చుకున్న కాసాల జైపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. ఒకప్పటి నిజామాబాద్ జిల్లా, ఇప్పటి కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలం అల్లాపూర్ ఆయన స్వగ్రామం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం మీద ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
నిజానికి జనవరి 22వ తేదీన ఆయన పుట్టినరోజు. పర్సనాలిటీ డెవలప్ మెంట్ మీద దాదాపు 8 వేల లెక్చర్స్ ఇచ్చిన ఆయన తన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం చర్చనీయాంశం అయింది. జనవరి 12 2009 స్వామి వివేకానంద జయంతి రోజున ప్రారంభించిన తన లక్ష్యం పదివేల ప్రసంగాలుగా ముందుకు సాగి మధ్యలో అనారోగ్యం కారణంగా, కరోనా వల్ల 7535 ప్రసంగాల మైలురాయిని చేరి అక్కడే పరిమితమయ్యిందని కొద్ది రోజుల క్రితం ఆయన తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే తన ఉన్నత చదువు మరియు తాను స్థాపించిన స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్స్ ల వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, పీకల్లోతు నష్టపోయి, క్లిష్టమైన పరిస్థితుల్లో తెలిసిన వారి దగ్గర చేసిన అప్పుల గురించి ప్రస్తావిస్తూ తాను చేస్తున్న స్వచ్ఛంద సేవలకు విరామం ఇస్తున్నానని, విరమణ కాదు విరామం మాత్రమే అని కూడా చెప్పుకొచ్చారు.
ఆయన వివరణ చూసిన తర్వాత ఆయన ఆత్మహత్యకు ముఖ్య కారణం ఆర్థిక ఇబ్బందులేననే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే 7500 ప్రసంగాలు వ్యక్తిత్వ వికాసం మీద స్కూల్ పిల్లలకు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అంత మంది పిల్లలను, తమ వ్యక్తిత్వాన్ని ఎలా తయారు చేసుకుంటే భవిష్యత్తులో తమకు తాము స్వయంగా ఎదగగలం అనే విషయాన్ని తేటతెల్లం అయ్యేలా చెప్పారు. కానీ తన జీవితంలో వచ్చిన ఆటుపోట్లను మాత్రం తట్టుకోలేకపోయారు. గతంలో కూడా ఇలాగే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ కూడా వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించి, ఆ తర్వాత అనుకోకుండా అప్పులపాలై తాను తిరిగి అప్పులు చెల్లించలేనేమో తనమీద మోసగాడు అనే ముద్ర ఎక్కడ పడుతుందో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఆయన భార్య మాళవిక మాత్రం భర్త చనిపోయిన బాధలో కూడా కంపెనీని హస్తగతం చేసుకుని అనతికాలంలోనే దాదాపు సగానికి పైగా అప్పులు తీర్చగలిగింది. అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కచ్చితంగా ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తనదైన ప్రసంగాలతో పిల్లలను సైతం ఆకట్టుకునేలా చేసి వాళ్లకు ఒక భరోసా కల్పించిన జైపాల్ రెడ్డి తన ఆర్థిక సమస్యల విషయంలో, తనకు ఎదురైన ఇబ్బందులు విషయంలోనూ తనకు తాను అండగా నిలబడలేక తనకు తాను ధైర్యం చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం గమనార్హం.
మనం ఎక్కువగా ఎవరికష్టం వారిది, ఆ కష్టం వారికి తప్ప పక్కవారికి అర్థం కాదు అనేమాట వింటూ ఉంటాం. అది నిజమే అయి ఉండొచ్చు కానీ కష్టంలేని జీవి అనేది లేదు. చిన్నదో పెద్దదో జీవిగా జన్మించాక కష్టం అనేది లేకుండా జీవితం అనేది ఉండదు. డబ్బు అనేది ఇక్కడ సమస్యగా కనిపిస్తోంది కానీ డబ్బున్న వారికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే జీవితం సాఫీగా నడుస్తుంది కానీ ఇంకా ఏం పోరాడుతాంలే అనుకుంటే మాత్రం ఆ జీవితానికి ఒక సార్థకత అనేదే ఉండదు.