ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అనూహ్య రాజకీయాలను చేస్తోంది. కనీసం డిపాజిట్ అయినా దక్కుద్దా అన్న ఆందోళన ఆ పార్టీ లో కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోని అంశం అయినప్పటికీ పదే పదే వైసీపీని టార్గెట్ చేసి విమర్శించడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తతలు, అసంకల్పిత కథలు అల్లే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగానే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ ప్రచారంలో భాగమో, ఏమో కానీ చంద్రబాబుపై రాళ్ల దాడి అంటూ కొత్త వివాదం ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తిరుపతిలో సోమవారం సాయంత్రం జరిగిన చంద్రబాబు ప్రచార సభలో రాళ్ల దాడి జరిగిందంటూ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంవద్ద చంద్రబాబు సమక్షంలో తిరుపతి ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు అందజేశారు. దానికి సంకేతంగా చంద్రబాబు కూడా ఓ రాయిని చేత్తో పట్టుకుని చూపుతూ సభలో ప్రదర్శించారు. ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వేశారు, అది రాళ్ల దాడా, టీడీపీ అద్భుత కల్పన అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
ఈలోగా ఎన్నిక పూర్తయిపోతుంది తమకు ఇక ఏం లాభం ఉంటుందని టీడీపీ నాయకులు అనుకున్నారో ఏమో అదంతా వైసీపీ కుట్రే అని ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రచారం కాదు.. చంద్రబాబును భయపెట్టి ప్రచారం చెయ్యనీకుండా అడ్డుకోవడమే కాకుండా ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు దాడి చేయించారని ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీకి చెందిన వ్యక్తులు గులకరాళ్లతో దాడి చేశారని, చంద్రబాబు ప్రచార రథంపై, టీడీపీ కార్యకర్తలపైన, అలాగే మీడియా వాహనాలపై ఆ గులకరాళ్లు పడ్డాయని అందులో పేర్కొన్నారు. గులకరాళ్లు తగిలి ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రచార రథం, మీడియా వాహనాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. రెండు గులకరాళ్లను కూడా పోలీసులకు అందజేశారు. వారు చెప్పిన స్థాయిలో అక్కడ రాళ్ల దాడి జరిగి ఉంటే గులకరాళ్లు రెండు కాదు, రాళ్ల గుట్ట ఉండాలి. కానీ, అలాంటి దాఖలాలు ఏవీ అక్కడ లేవని పోలీసులు తెలిపినట్లుగా తెలిసింది.
సీసీ ఫుటేజీని పరిశీలించి రాళ్లెవరు వేశారన్నది తెలుసుకుని చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ సుప్రజ హామీ ఇచ్చారు. కానీ, స్వయంగా చూసినట్లే, లేదా దగ్గరుండి చేయించినట్లుగా తమపై దాడికి పాల్పడింది నిర్ధారించేసి వైసీపీ నాయకుల పైన, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పైన, వారి కార్యకర్తలపైన తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఉటంకించారు. ఇంత పెద్ద సభ జరిగితే కనీసం ఇక్కడ పోలీసులు లేరని చంద్రబాబు ఆరోపించారు. కానీ, అధికారిక లెక్కల ప్రకారం అక్కడ 220 మంది పోలీసులను బందోబస్తులో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఎస్పీ సుప్రజ టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లినా వారు వినిపించుకోకుండానే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసేశారు. ప్రచార రథం దిగి రోడ్డుపై బైఠాయించారు.‘రండిరా యూజ్లెస్ ఫెలోస్ తేల్చుకుందాం. పోలీసులను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడి చేస్తారా?ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా మీతోకలు కట్ చేస్తా. రౌడీలను ఎక్కడపెట్టాలో అక్కడ పెడతా’అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేవాలయాలపై దాడులు, హత్యా యత్నాలు ఘటనలు జరిగినప్పుడు ఇది వైసీపీ నాయకుల కుట్ర అంటూ గతంలో చాలా సార్లు టీడీపీ నేతలు ఆరోపించారు. వాటిలోని కొన్ని ఘటనల్లో టీడీపీ నేతలే నిందితులుగా తేలడంతో పోలీసులు కొందరిని అరెస్ట్ కూడా చేశారు. ఈ ఘటనపై కూడా నిజం త్వరలో తేలనుంది. అసలు అది రాళ్ల దాడే కాదని కొందరు అనుమానిస్తున్నారు. కేవలం రాళ్లను చూపిస్తూ ఉద్రిక్త పెంచేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తిరుపతిలో ఓడిపోతారని చంద్రబాబుకీ తెలుసని, ఆయన ఆడే నాటకంలో ఇదొక భాగమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఓడిపోతారని తెలిసే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రాళ్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్నారు. ‘‘ఎవరికీ దెబ్బలు తగల్లేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుపై ఎవరు రాళ్లు విసిరినా చర్యలు తీసుకోవాలి. చచ్చిన పామును కర్రతో కొట్టాల్సిన పనిలేదు.’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.