ఓటిటిలో కొత్త ట్రెండ్ కి నాంది పలుకుతూ నిన్న జీ సంస్థ తన జీ ప్లెక్స్ ద్వారా బాలీవుడ్ మూవీ ఖాలీ పీలీ, తమిళ సినిమా కెపే రణసింగంని పే పపర్ వ్యూ పద్ధతిలో 299, 199 రూపాయలు టికెట్ ధరలు నిర్ణయించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి స్పందన ఎలా ఉంది, మొదటి రోజు ఎంత రెవిన్యూ వచ్చిందనే వివరాలు ఇప్పట్లో బయటికి రావు కానీ ఈ పద్ధతిని ఇకపై కూడా కొనసాగించేలా సదరు యాప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి మోడల్ సక్సెస్ కావాలంటే క్రేజ్ ఉన్న హీరో, కంటెంట్ అవసరం. అవి ఉంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకులు తాము చెల్లించే ధరకు న్యాయం జరుగుతోంది అనుకుంటారు.
అందుకే సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ మూవీని ఇదే త్వరలో తరహాలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయట. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ కు సంబంధించి ఒప్పందాలు పూర్తయిపోయాయి. దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది. ఒక వ్యూ కు టికెట్ ధర 100 నుంచి 150 రూపాయల మధ్య పెడితే వర్కవుట్ అవ్వొచ్చనే దిశగా ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది. మెగా హీరో కాబట్టి రెస్పాన్స్ బాగుండొచ్చని ఒక అంచనా. అయితే ప్రైమ్ లాంటి యాప్స్ నెల మొత్తం కలిపి 129 రూపాయలు తీసుకుంటున్నప్పుడు కేవలం 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అయ్యే పే పర్ వ్యూ ఎలా సక్సెస్ అవుతుందని అంటున్న వాళ్ళు లేకపోలేదు. థియేటర్లను తెరిచే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో సోలో బ్రతుకే సో బెటరూ లాంటి సినిమాలు భారీ పెట్టుబడులు వెనక్కు తెచ్చుకోవడం కష్టం.
అందులోనూ జనం మూడ్ ఎలా ఉందో తెలియదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కుటుంబాలతో కలిసి హాళ్లకు వస్తారా అనేది అనుమానమే. ఇవన్నీ ఆలోచించే సోలో బ్రతుకే డిజిటల్ కే ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. జీ సంస్థ ప్రవేశ పెట్టిన ఈ పే పర్ వ్యూ పట్ల సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక్క సినిమాకు అంత ఎక్కువ ధరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందులోనూ ఆన్ లైన్ పైరసీ విచ్చలవిడిగా ఉన్న తరుణంలో ఇదంత సేఫ్ గేమ్ కూడా కాదు. అసలే కీర్తి సురేష్, నాని, అనుష్క లాంటి స్టార్లు నటించిన సినిమాల డిజిటల్ రిలీజులే నిరాశపరిచిన నేపథ్యంలో ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. అది సాయి తేజ్ సినిమా అయినా తీరుస్తుందేమో చూడాలి. సుబ్బుని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ మూవీలో నభ నటేష్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే రెండు ఆడియో సింగిల్స్ రిలీజయ్యాయి