భారీ వర్షాలు వరదల కారణంగా హైదరాబాద్ మహానగరం తీవ్రంగా నష్టపోయింది. జలదిగ్భంధంలో చిక్కుకుని విశ్వనగరం కాస్త విలవిల్లాడుతుంది. పలుచోట్ల కాలనీలు వీధులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తక్షణమే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు రాష్ట్రాలు ఉదారంగా విరాళాలు ప్రకటించాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా తమ వంతు సాయాన్ని విరాళాలుగా ప్రకటించారు.తాజాగా జనసేన అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
వరదల కారణంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజల సహయార్ధం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి వీడియో సందేశం విడుదల చేశారు. వీడియో సందేశంలో కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలయి ప్రజలంతా ఇబ్బందుల పడుతున్న సమయంలో గత దశబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైందని తెలంగాణలో దీని తాకిడి మరింత ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
భారీ వర్షాలు, వరదల మూలంగా ప్రజల జీవన విధానం చిన్నాభిన్నం అయింది. గత కొన్ని దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం ఒక కారణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజలు పడుతున్న కష్టాలు చూసి… ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా వంతుగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. జన సైనికులతో పాటు అభిమానులు, నాయకులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు సాయం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.