రాత్రికి రాత్రి సీఎం అయిపోదామని రాజకీయాల్లోకి రాలేదు అని సినీహీరో పవన్‌కల్యాన్ పదేపదే చెబుతుంటారు. ఆయన చెప్పిందాంట్లో తప్పేం ఉందని ఆయన అభిమానులు ప్రశ్నించవచ్చు. నిజమే తప్పులేదు. కాని పవన్‌కల్యాన్ అనుకుంటే కావడానికి సీఎం అంటే బిగ్‌బాస్ రియాల్టీ షోలో విన్నర్ కావడమో లేక మీలో ఎవరు కోటీశ్వరుడులో కోటి రూపాయలు బహుమతి గెలుచుకోవడమో కాదు బ్రదరూ.
24 ఇంటూ 7 ప్రజల మధ్య ఉంటే తప్ప వారి ఆదరాభిమానాలు చూరగొనలేరు. ఈ నేతకు అధికారం ఇస్తే తమకు అండగా నిలుస్తారనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేలా రాజకీయాలు నడపాలి. హక్కు ఉంది కదా అని ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇతరులను ముంచడానికి తెరముందుకు వచ్చిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని చూస్తూనే ఉన్నాం.
ప్రజలు చాలా విజ్ఞులు. రాజకీయ నాయకులు బ్రహ్మరాతనైనా తప్పించుకుంటారామో గాని ప్రజల రాత నుంచి తప్పించుకోలేరు. జనసేన పార్టీని స్థాపించి సమాజ మార్పు, ఆశయాలు, చేగువేరా, ఎర్రజెండా అంటూ ఆవిష్కరణ సభలో పవన్ ఊగిపోవడమే కాకుండా…యువతలో ఊపు తెచ్చిన మాట వాస్తవం. కాని ఒక రాజకీయ నేత క్షేత్రస్థాయిలో వేసే అడుగులే అతని లేదా ఆమె భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
ఒక నూతన రాజకీయ పార్టీ అధినేతగా పవన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోగా తగదునమ్మా అంటూ 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలకు సంపూర్ణ మద్దతు పలకడమే కాకుండా వాటి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్రంతో పాటు రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీల అప్రజాస్వామిక పాలన గురించి దాదాపు మూడేళ్ల పాటు నోరెత్తిన పాపాన పోలేదు. ఆ తర్వాత గుంటూరులో జనసేన ఆవిర్భావ సభలో టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబ్బో పవన్‌లో ఎంత మార్పు అనుకున్నారంతా. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ప్రారంభించారు.
అర్రె ఇదేంది…తమను అష్టకష్టాల పాలు చేస్తున్న పాలక టీడీపీపై కాకుండా జగన్‌పై తిట్ల పురాణానికి తెర లేపారని జనం జాగ్రత్తగా గమనించారు. అంతే తమకంటూ వచ్చిన ఎన్నికల రోజు జనం చేయాల్సిన పని చేశారు. చివరికి పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలలో సైతం గెలవలేకపోయారు.
చివరగా చెప్పేదేంటంటే సీఎం కావడం అంటే రియల్ హీరో కావడమే. అంతే తప్ప అదేమీ వంశపారంపర్యంగా అనుభవించడానికి రీల్ హీరో కాదు. తండ్రి సీఎం కాబట్టే జగన్ సీఎం కాలేదు. అన్న హీరో కాబట్టి పవన్ హీరో కాగలిగాడు. కాని అది రీల్‌కు సంబంధించి. ఇప్పటికైనా పవన్‌కు మించిపోయిందేమీ లేదు. చంద్రబాబు కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారనే ముద్ర నుంచి బయటపడటమే ఆయన ముందున్న పే..ద్ద టాస్క్. దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే సీఎం పదవి గురించి ఆలోచించవచ్చు. అలా కాకుండా అమావాస్యకో, పుణ్నానికో మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడితే ఎల్లో మీడియాకు ఒకరోజుకు పతాక శీర్షిక ఇచ్చిన వారవుతారు. అంతే తప్ప అంతకు మించి ఒరిగేదేమీ ఉండదు బ్రదర్