ఒక పార్టీ గానీ.. ప్రభుత్వం గానీ హామీ ఇస్తే పక్కాగా ఉండాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల మేలునే కాంక్షించేలా ఉండాలి. అలా కాకుండా హడావుడిగా.. ఎన్నికల ప్రయోజనాల కోసమే చేపట్టే పథకాలు ప్రజల్లో విశ్వాసం కలిగించకపోగా.. వాటినే నమ్ముకున్న పార్టీలు, నేతలను బోల్తా కొట్టిస్తాయనడానికి తాజా ఉదాహరణ దళిత బంధు పథకం. హుజురాబాద్ ఉప ఎన్నిక తథ్యమని తేలిన వెంటనే తన మాజీ సహచరుడు ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు పసుపు-కుంకుమ పథకాన్ని ఇలాగే తెరపైకి తెచ్చి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఆ విషయం తెలిసిన కేసీఆర్ అదే ఫార్ములా అనుసరించి ఓటమిని కొనితెచ్చుకున్నారు.
బాబుకు నామం పెట్టిన మహిళలు
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో అనుభవం పేరుతో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజామద్దతు వెల్లువెత్తడం.. టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రతరం కావడాన్ని గుర్తించిన ఆయన పాత హామీల ఊసు ఎత్తకుండా కొత్త హామీల వల వేశారు. ప్రజలకు తక్షణ ఆర్థిక ప్రయోజనం కల్పించి మరోసారి ఓట్లు దండుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా మహిళకు పసుపు-కుంకుమ అంటూ వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.10 వేలు చొప్పున రూ.10 వేల కోట్లు ఆ సంఘాల ఖాతాలోకి నగదు బదిలీ చేశారు. మిగతా పథకాల నిధులను దానికే మళ్లించారు. అలాగే సామాజిక పెన్షన్లను దశల వారీగా రూ.3 వేల వరకు పెంచుతామని జగన్ ఇచ్చిన హామీని పులిని నక్క వాత పెట్టుకున్నట్లు కాపీ కొట్టారు. అప్పటివరకు రూ. వెయ్యి ఉన్న పెన్షన్ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచారు. అయితే అటు మహిళలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులు చంద్రబాబు ఎత్తుగడను గమనించారు. డబ్బులు తీసుకున్నా.. ఓట్లు వేయకుండా తిప్పికొట్టారు. దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు.
హుజూరాబాద్‌లో సేమ్ సీన్
ఏపీలో ఎన్నికల సీన్ హుజురాబాదులో రిపీట్ అయ్యింది. అవినీతి ఆరోపణలతో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కేసీఆర్ పదవి నుంచి తొలగించడంతో ఆయన టీఆరెస్ కు రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. దాంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని, అక్కడ మళ్లీ ఈటల పోటీ చేయడం కూడా ఖాయమని తేలింది. దాంతో ఈటల రాజేందర్ ను ఎలాగైనా సరే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టారు. అందులో భాగమే దళితబంధు పథకం. అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రకంగా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించడం దీని లక్ష్యం. పేరుకు రాష్ట్రవ్యాప్త. పథకం అయినా మొదట పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాదులోనే ప్రారంభించడం వెనుక ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లు గంపగుత్తగా కొట్టేయాలన్న ప్రణాళిక ఉందని అప్పట్లోనే ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆ విమర్శలను పట్టించుకోని కేసీఆర్ తన దత్తత గ్రామం వాసలమర్రిలో ఆగస్టులో పథకాన్ని ప్రారంభించి ఆవెంటనే హుజురాబాదులో పథకం అమలుకు రూ.500 కోట్లు విడుదల చేశారు. అయితే ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓటమి పాలవ్వడంతో కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందని తేలిపోయింది. ఏక మొత్తంగా పడతాయనుకున్న దళిత ఓట్లు దక్కలేదు సరికదా.. మరి మా సంగతేంటి అంటూ మిగిలిన వర్గాల ఓటర్లు శీతకన్ను వేయడంతో టీఆరెస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఓటమి భారంతో గొల్లు మానాల్సి వచ్చింది.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఏపీ సీఎం జగన్ మాదిరిగా పథకాలను నిక్కచ్చిగా అమలు చేసేవారినే ఓటర్లు విశ్వసిస్తారని.. ఆ నమ్మకం కలిగించలేని వారిని తిరగ్గొడతారనడానికి ఈ రెండు నిఖార్సైన ఉదాహరణలు.
Also Read : Tdp ,Konatala -కొణతాలకు టీడీపీ ఆఫర్.. ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి..?