అనంతపురం జిల్లా కలలు సాకారం అవుతున్న వేళ రాజకీయ అలజడి, ఇది తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న పన్నాగమా!?
ముగ్గురు ముఖ్యమంత్రులు అనంతపురం జిల్లా పేరూరు డ్యాం కు నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు
1.2009 లో రైతు బంధు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి
2.2012 పాదయాత్రలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
3.2017 ప్రజా సంకల్పయాత్రలో నేటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి
అలా హామీ పొందిన ఈ ప్రాజెక్టు కు నీరు పారె విషయంలో కర్ణుడికి ఎన్ని శాపాలో లెక్కపెట్టడం సులభం, కానీ ఈ పేరూరు డ్యాం కు నీళ్ళు తేవడానికి ఎదురైన అడ్డంకులు మాత్రం లెక్కపెట్టడం చాలా కష్టం, వాటన్నింటినీ అధిగమిస్తూ నేడు పేరూరు డ్యాం కు కృష్ణా నీళ్లు
అడుగు పెడుతున్న సందర్భంలో రాజకీయ అలజడి!! పేరూరు డ్యాం వద్ద గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన శిలా ఫలకాలు ఎవరో ధ్వంసం చేశారనే అభియోగంతో!
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కృషితో పేరూరు కు నీళ్ళు ఇవ్వాలని గత జనవరిలో ప్రభుత్వం ఉత్తరువులు ఇచ్చినప్పుడు రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అలజడి చోటు చేసుకోలేదు!
గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఒక్కో చెరువు దాటుకుంటూ స్థానిక నేతల డిమాండ్లతో రొద్దం,పెద్దకోడిపల్లి చెరువులు నింపిన కృష్ణమ్మ నీళ్ళు నాగలమడక కు వొచ్చేవరకు ఎక్కడా శిలా ఫలకాలు ధ్వంసం కాలేదు!! ఆశ్చర్యంగా ఈ రాత్రికో రేపు ఉదయానికో పేరూర్ డ్యాంకు నీళ్లు చేరతాయని ప్రజలందరు పండగ వాతావరణంలో ఎదురు చూస్తుండగా శిలాఫలకాల ధ్వంసం అలజడి వెనుక వున్న ఉద్దేశ్యాలను జన సామాన్యులు కూడా వూహించగలరు. ఎన్నికల ఫలితాలు వొచ్చిన రోజు కూడా ఎక్కడా ఘర్షణలు జరగలేదు,శిలాఫలకాలు పగలకొట్టలేదు.
పరిటాల దంపతులు అప్రతిహతంగా 1994 నుంచి 2019 వరకు అంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో 15 సంవత్సరాలు టీడీపీనే అధికారంలో ఉంది. పరిటాల కుటుంబానికి మొదటి ఓటమి మొన్నటి 2019 ఎన్నికల్లోనే ఎదురయ్యింది. పరిటాల రవి కొంత కాలం మంత్రిగా పనిచేశారు. రవి మంత్రిగా లేని సమయంలో కూడా జిల్లా నుంచి ఎవరు మంత్రి కావాలో నిర్ణయించే స్థాయిలో అధికారాన్ని చెలాయించారు. పరిటాల సునీతమ్మ ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు.తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ పేరూర్ డ్యాంకు నీళ్లు తెచ్చి ఉంటే సమస్యే ఉండేది కాదు.2016 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరూరు ,భైరవాని తిప్ప ప్రాజెక్టులకు జీడిపల్లి నుంచి నీళ్లు ఇచ్చే పథకాలను ప్రకటించినప్పుడు పత్రికల్లో ఇచ్చిన అభినందనల ప్రకటనలు మీద ఉన్న ద్యాస పనులు మొదలు పెట్టించటం,పూర్తిచేయటం మీద లేకుండా పోయింది. 2016 అక్టోబర్ నుంచి 2019 మార్చ్ అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలలో పనులు 100% చేసి ఉండొచ్చు లేదా కనీసం 60-70% పనులైనా చేసి ఉండొచ్చు కానీ జరిగిన పనులు శూన్యం ..
Also Read : నెరవేరుతున్న ఎగువ పెన్నా రైతుల కలలు – నీటి ప్రాజెక్టులు
సునీతమ్మ మంత్రిగా పనిచేసిన సమయంలో ఇదే పథకాన్ని అంటే నాగలమడక మీదుగా పేరూరు డ్యాముకు నీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంతే కాదు సునీతమ్మకు పేరూరు కు నిజంగా త్వరితగతిన నీళ్ళు ఇవ్వాలనే చిత్త శుద్ధి ఉండుంటే సునీతమ్మ ఆర్భాటంగా పేరూరు లో నాటి ముఖ్యమంత్రి సభకు ఖర్చుచేసిన నిధులతో నీళ్ళు తీసుకు వచ్చేవారు. నాడు తమ అధినాయకుడికి నాటి కన్నడ ముఖ్యమంత్రికి అత్యంత సాన్నిహిత్యం ఉండేది కదా!! సునీతమ్మ అన్నట్టు కన్నడ ప్రాంతం గురించి అనుమానాలే ఉండి ఉంటే వాటికి నిబంధనలతో కూడిన అనుమతులు క్షణాల్లో వచ్చేవి కదా మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు?కర్ణాటక వాళ్ళు 5% నీళ్లు వాడుకుంటారు అని 95% నీళ్లు రాకుండా రాప్తాడు నియోజకవర్గాన్ని ఎందుకు ఎండబెట్టారు?
ఇలాంటి ప్రజా ప్రయోజనకరమైన మార్గాన్ని వదిలి తీవ్ర వొత్తిడి తెప్పించి 2017 ఆగస్టు 15 న పేరూరు డ్యాం కు నీరిచ్చే పథకానికి ప్రకటన చేయించి 18 రోజుల్లో శంఖుస్థాపన చేయించారు , ఆ పనుల్లో భాగమైన పుట్టకనుమ కావచ్చు, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ల పనులు కావొచ్చు ..మొదలు పెట్టారా?ఎంత శాతం పనులు జరిగాయి?
గతంలో సునీతమ్మ పేరూరు కు నీళ్ళు ఇవ్వాలనేది పరిటాల రవి కల అని చెప్పారు,ఆ కల మరి కొన్ని గంటల్లో నిజమయ్యే సమయం వచ్చేసింది అలాంటి సందర్భంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రకాష్ రెడ్డి నీళ్ళు తెస్తే అభినందించాల్సింది పోయి శిలాఫలకాల ధ్వంసం చేసిన ఘటనను అడ్డుపెట్టుకొని లక్షలాది బడుగు రైతుల ఆనందాన్ని వమ్ము చేయటం ఎందుకు?
శిలాఫలకాలు ధ్వంసం చేయడమనేది ఆటవిక చర్య, తీవ్రంగా గర్హించాల్సిన అంశమే, కానీ దీనికి బాధ్యులు ఎవరనేది పోలీసు శాఖ తేల్చాల్సి ఉంది వారు ఎవ్వరైనా సరే శిక్షార్హులే! శిలాఫలకాల ధ్వంసం మీద చట్టప్రకారం ఫిర్యాదు చేయండి కానీ తమ వర్గం ఉద్రిక్తతలు సృష్టించకుండా సునీతమ్మ చూసుకోవాలి.
కరువు ప్రాంతంలో మాత్రం రాజకీయాలను, నీళ్ళ అవసరాలను వేరు వేరుగా చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది.