గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను మంగళవారం నాడు ప్రకటించింది. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీగా మారింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగా ఆ లిస్టు విడుదల చేశారు. 128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిపాదించిన ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. అలాగే తెలుగు వారయిన ఒకరికి తమిళనాడు నుంచి అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆయన ప్రవచనాలతో తెలుగు ప్రజలు అందరికీ దగ్గరయ్యారు.
ఆరోగ్య విభాగంలో డా.సుంకర వెంకట ఆదినారాయణ రావుకు కూడా పద్మ శ్రీ అవార్డు దక్కింది. ఆర్థోపెడిక్ సర్జన్ అయిన ఆయన పేదల కోసం చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా , భీమవరంలో ఆయన జన్మించారు. అలాగే మరణానంతరం గోసవీడు షేక్‌హసన్ కు ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలాగే తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో పద్మజా రెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి. మొగిలయ్య ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మరోసారి ఫేమస్ అయ్యారు. ఆయన రూపొందించిన 12 మెట్ల కిన్నెర వాయిద్యం ద్వారా మంచి గుర్తింపు పొందారు.
ఇక కరోనా వ్యాక్సిన్ సృష్టించిన తరువాత దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి విశేషమైన కృషి చేసిన కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది. కోవిషీల్డ్ టీకా తయారు చేసిన సీరమ్ సంస్థ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలాకు సైతం పద్మభూషణ్ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు, ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కూడా పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో సుపరిచితురాలైన షావుకారు జానకికి తమిళనాడు విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు దక్కింది. అలాగే ప్రముఖ సింగర్ సోను నిగమ్ కి కూడా మహారాష్ట్ర కేటగిరిలో పద్మశ్రీ అవార్డు దక్కింది.