ఆత్మవిశ్వాసం ఉంటే కొండనైనా పిండి చేయొచ్చంటారు. ఆత్మవిశ్వాసానికి మించిన బలం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రెండు చేతులు లేకపోయినా సంకల్ప బలం తో ఆ యువకుడు జీవితాన్ని గెలిచాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ యువకుడి ఆత్మవిశ్వాసానికి, చేయూతనిచ్చే మనసుకు ముగ్దుడయ్యారు. కేరళ లోని పాలక్కడ్ జిల్లాకు చెందిన ప్రణవ్ కు రెండు చేతులు లేవు. అయినా అందరిలా జీవనం సాగిస్తున్నాడు. తన కాళ్ళనే చేతులుగా మలుచుకుని రోజువారీ పనులే కాదు.. పెయింటింగ్ కూడా వేస్తాడు. మొబైల్ లో సెల్ఫీ కూడా కాళ్ళ తోనే తీసుకుంటాడు.
ప్రణవ్ తాను సంపాదించిన మొత్తంలో కొంత ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళంగా ఇచ్చేందుకు సీఎం పినరయి విజయన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ప్రణవ్ ను సాదరంగా ఆహ్వానించినా సీఎం విజయన్ తన అరచేతి తో ప్రణవ్ పదాన్ని తాకి ” పాద చాలనం” తో పరిచయం చేసుకున్నారు. ప్రణవ్ తాను ఇచ్చే చెక్ ను కాలి తోనే ఇవ్వగా సీఎం అందుకున్నారు. అనంతరం ప్రణవ్ తన కాలితోనే మొబైల్ లో సీఎం తో కలసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ చిత్రాలను సీఎం విజయన్ ట్విట్టర్ లో పెట్టడంతో వైరల్ అయ్యాయి.