థియేటర్లు మూతపడటం అనే చేదు పరిణామం తమకు గొప్ప వరంగా మార్చుకున్న ఓటిటి సంస్థలు మొత్తానికి ఐదు నెలలు చిన్న చితక సినిమాలు, వెబ్ సిరీస్ లతో నెట్టుకొచ్చినప్పటికీ వచ్చే నెల నాని ‘వి’తో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నాయి. అయితే ఆ ఒక్క సినిమా ప్రైమ్ కైనా రోజుల తరబడి ఫీడింగ్ కు సెట్ కాదు. కనీసం పది పదిహేను రోజుల గ్యాప్ లో లేటెస్ట్ అప్ డేట్స్ ఉండాల్సిందే. లేకపోతే ప్రేక్షకులు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే హక్కులు కొనే విషయంలో ఎంత మొత్తమైనా సరే సై అంటున్నాయి. అక్షయ్ కుమార్ ‘లక్స్మీ బాంబ్’కు హాట్ స్టార్ 150 కోట్లు చెల్లించిందన్న వార్త చాలా రోజులు హాట్ టాపిక్ గా నిలిచిపోయింది.
ఇదే తరహాలో సూర్యవంశీ, 83లకు కూడా ఆఫర్లు ఇచ్చారు కానీ నిర్మాతలు వాటిని కొట్టిపడేశారు. ఇప్పుడు విజయ్ ‘మాస్టర్’ లైన్లోకి వచ్చింది. రెండు నెలల క్రితం ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు 80 కోట్లు ఆఫర్ చేసిన ఓ సంస్థ ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసి 100 కోట్లు చెప్పిందట. అయితే ఇది ఎంత టెంప్టింగ్ ఆఫర్ అయినప్పటికీ నిర్మాతలు సిద్ధంగా లేరని చెన్నై టాక్. మాస్టర్ కైనా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఒక్క ఓటిటికే ఇంత రేట్ అంటే పెద్ద మొత్తమే. ధనుష్ నటించిన ‘జగమే తంతిరం’ సైతం 60 కోట్ల దాకా డీల్ వచ్చిందట. కానీ నిర్మాత ఈ వార్తను ఖండిస్తూ ట్విట్టర్ లో మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన నిర్మాణంలో రూపొందిన పెంగ్విన్ ని ఓటిటి విడుదల చేసిన సంగతి మర్చిపోకూడదు.
ఇక తెలుగు విషయానికి వస్తే ఇదే తరహాలో రెడ్, ఉప్పెనలకు ఊరించే ఆఫర్లు వస్తున్నాయి కానీ ప్రొడ్యూసర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇంకా ఆలస్యమైతే సంక్రాంతిని టార్గెట్ చేసుకోవచ్చనేది వాళ్ళ ఆలోచన. రవితేజ క్రాక్ ఇంకా బాలన్స్ ఉంది. అది అయ్యాక ఏదైనా ఆశించవచ్చు. నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మాత్రం డిజిటల్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరణ్య టీమ్ సైతం మౌనాన్నే ఆశ్రయించింది. మొత్తంగా కనివిని ఎరుగని రీతిలో ఇలా ఓటిటిలు నిర్మాతలను ముంచెత్తడం మాత్రం ఊహించని పరిణామం. పైన చెప్పినవాటిలో కూడా మున్ముందు నిర్ణయాలు మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నాయి అవి ఫేడ్ అవుట్ కావడం అనేది జరగని పని. ఇంట్లో ఎంత సౌకర్యవంతంగా సినిమాలు చూసినా అవి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ముందు దిగదుడుపే. కరోనా పూర్తిగా తగ్గాక వాటికి పునర్ వైభవం వస్తుంది. అది ఎప్పుడు అనేదే వెయ్యి డాలర్ల ప్రశ్న