వర్షానికి, రాజకీయానికి సంబంధం ఏంటనుకుంటున్నారా..! కవితకు కాదేదీ కనర్హం అన్నట్లు.. ఇప్పుడు ప్రతీ అంశంపైనా రాజకీయ అగ్గి రాజుకుంటోంది. తెలంగాణలో బుధవారం కురిసిన వర్షం వల్ల కూడా అదే జరిగింది. ఆ వర్షానికి ప్రముఖ ఆస్పత్రిగా పేరొందిన ఉస్మానియా నిండా మునిగింది. ఏకంగా రోగులకు చికిత్స అందించే వార్డులు వరద నీటితో మునిగిపోయాయి. డాక్టర్లు, రోగులు ఆ నీటిలోనే కాలం గడిపారు. తాజాగా ఆస్పత్రి పరిసరాల్లో నిర్మించిన అంతర్గత రోడ్ల నిర్మాణంలో ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు వార్తలొచ్చాయి. కారణం ఏదేమైనా వర్షంతో ఉస్మానియాలో తలెత్తిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..
ఓ పార్టీ తర్వాత.. మరో పార్టీ..
ఆసలే కరోనా కాలం.. ఇదే సమయంలో బుధవారం కురిసిన వర్షానికి ఉస్మానియాలో తలెత్తిన సమస్యలకు సంబంధించి గురువారం మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులూ ఆస్పత్రి సందర్శనకు వెళ్లిపోయారు. ఉస్మానియా వరదలపై ప్రభుత్వ, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై ఒకరు.. బురద జల్లుకున్నారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నుంచి స్థానిక టీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్పత్రిని సందర్శించారు.
ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి : తలసాని
సుమారు 27 ఎకరాలకు పైగా స్థలంలో పేదల కోసం ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాలను నిర్మించేందుకు పనులు ప్రారంభిస్తే.. కేసులు వేసి ప్రతిపక్షాలు వాటిని అడ్డుకుంటున్నాయిని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. పేదల ఆరోగ్యం సీఎం కేసీఆర్ మహత్తర ప్రణాళికతో ముందుకెళ్తుంటే.. ప్రతిపక్షాల కారణంగానే అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌకర్యాలు కల్పించకే ఇబ్బందులు : బండి సంజయ్
నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే రోగులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంచాలపై రోగులు, మంచాల కింద మురుగు నీరు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొత్త భవనాలు నిర్మిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజా అవసరాల కోసం కాకుండా.. సొంత ప్రయోజనాలను ఆశించి పని చేస్తున్నారని అన్నారు. చిన్నపాటి వర్షానికే ఆస్పత్రి మొత్తం జలమయం అయిందని తెలిపారు.
పాలకుల వైఫల్యమే : ఉత్తమ్
చిన్నపాటి వర్షానికే ప్రముఖ ఆస్పత్రి అయిన ఉస్మానియా మునిగిందంటే.. అది పూర్తిగా పాలకుల వైఫల్యమే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై రోజురోజుకూ ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇతర వ్యాపకాలపై ఉన్న శ్రద్ధ.. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మాణంలో లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.