కరోనా వైరస్ కారణంగా ఇళ్లలోనే క్రికెటర్లు లాక్ డౌన్ అయిన వేళ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,డేవిడ్ వార్నర్ వంటి కొంతమంది ప్లేయర్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.తాజాగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో రోహిత్ శర్మతో మాట్లాడాడు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్ బ్యాటింగ్‌లో రాణించటం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ రాణించటానికి ఓపెనర్లుగా తాము శ్రమించడమే కారణమని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రకటించాడు.
రోహిత్ శర్మతో సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ “అందరూ విరాట్ కోహ్లీ,స్టీవ్‌స్మిత్‌లు గొప్ప బ్యాట్స్మెన్లు అని కీర్తిస్తున్నారు. కానీ వారిద్దరూ అలా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చెయ్యడానికి కారణం మనమే కదా రోహిత్… ఓపెనర్లుగా బంతి మెరుపుని దెబ్బతీయడం మన కీలక బాధ్యత. ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే వారిద్దరూ ఇన్నింగ్స్ మధ్యలో స్వేచ్ఛగా బ్యాటింగ్‌లో చెలరేగి పోతున్నారు.కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణకు ఆయా దేశాలు తీసుకున్న చర్యల కారణంగా టి 20 ప్రపంచ కప్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగే అవకాశం లేదు.పైగా ప్రపంచ కప్ లో ఆడే 16 జట్లను ఒక చోటికి చేర్చడం కష్ట సాధ్యము” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దీనికి రోహిత్ స్పందిస్తూ “అంతర్జాతీయ క్రికెట్‌ను పునర్ ప్రారంభించటానికి ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన గొప్ప మార్గం. నేను ఆస్ట్రేలియాతో ఆడటాన్ని చాలా ఇష్టపడతాను.మేము గత ఆసిస్ పర్యటనలో గెలవడం మాకు చాలా గొప్ప అనుభూతి. మీరు (డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్) గత పర్యటన నుండి తప్పుకున్నారు.మా బౌలర్లు,బ్యాట్స్మెన్లు అక్కడ ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది. నేను ఇప్పటికే రాబోయే పర్యటన కోసం ఎదురు చూస్తున్నాను. ఇరు క్రికెట్ బోర్డులు సిరీస్ నిర్వహించేందుకు తగిన మార్గాన్ని అన్వేషిస్తాయని ఆశిస్తున్నట్లు” పేర్కొన్నాడు.
రోహిత్ మాటలకు వార్నర్ ప్రతిస్పందిస్తూ “మానసికంగా ఇది(గత సిరీస్ విజయం) భారత క్రికెట్‌కు గొప్పది, కానీ ఇది నాకు చూడటానికి చాలా కష్టం అనిపించింది. ఆ సమయంలో నేను జట్టుకు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. రాబోవు సిరీస్ జరుగుతుందని మరియు ఆ పోరు కోసం ఎదురు చూడవచ్చని ఆశిస్తున్నాను. నాకు ఇండియాలో ఇండియాతో ఆడటం చాలా ఇష్టం.ఇక రాబోవు సిరీస్ కోసం అందరూ(ఆసీస్ క్రికెటర్లు) మీకు వ్యతిరేకంగా ఉన్నారు.మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఆటను పరీక్షించే కఠిన పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయి” అని భారత క్రికెటర్లను హెచ్చరించాడు.