పేరుకి దేశవ్యాప్తంగా అధిక శాతం థియేటర్లు, కొన్ని సింగల్ స్క్రీన్లు తెరుచుకున్నాయి కానీ వాటిలో ఏమంత ఉత్సాహం కనిపించడం లేదు. కారణం కొత్త సినిమాలు రాకపోవడం. టెనెట్ ఓ మూడు నాలుగు రోజులు హడావిడి చేసింది కానీ ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చింది. చాలా చోట్ల కనీస పబ్లిక్ లేక షోలు రద్దు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో అత్తాపూర్ లోని ఓ మల్టీ ప్లెక్స్ లో దిల్వాలే దుల్హనియా లేజాయేంగే వేస్తే ఈవెనింగ్ షోకు ఒక్క టికెట్ కూడా తెగక ఏకంగా ఆ మూవీనే తీసేశారు. అలా అని సరిలేరు, భీష్మ, అల వైకుంఠపురములోకి ఎగబడటం లేదు. అవి కూడా సోసోగానే ఆడుతున్నాయి.
ఇక్కడే ఇలా ఉంటే మరి నార్త్ లో ఏం జరుగుతోందనే అనుమానం రావడం సహజం. అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్ల కొత్త రకాల ఎత్తుగడల తో రెవిన్యూ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక్కడ డిజాస్టర్ అయిన అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాది రాష్ట్రాల్లో సింగల్ థియేటర్లలో రిలీజ్ చేస్తే బాలీవుడ్ లేటెస్ట్ మూవీ శుభ మంగళ్ జ్యాదా సావధాన్ కంటే ఎక్కవ వసూళ్లు వచ్చాయంటేనే విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. ఇదే కాదు ఇదే తరహాలో ఇంకొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా లైన్ లో పెడుతున్నారు. ఇవి యూట్యూబ్, శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినవే అయినప్పటికీ ఆదరణ దక్కుతుండటం గమనార్హం.
ఈ ఉత్సాహంతో ఇంకొంత కాలం ఇవే కంటిన్యూ చేయబోతున్నట్టు ముంబై ట్రేడ్ టాక్. ఎలాగూ హిందీ క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ని ఎవరూ పట్టించుకోలేదు. సౌత్ డబ్బింగులు అయితే కనీసం కొత్త మొహాలనైనా ఎంజాయ్ చేయొచ్చని అక్కడి ఆడియన్స్ అభిప్రాయం. త్వరలో కార్తీ ఖైదీ, విశాల్ యాక్షన్, ధనుష్ అసురన్, చరణ్ వినయ విధేయ రామ తదితరాలు స్క్రీన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ తరహాలోనే వచ్చే జనవరిలో హిందీ సినిమాలు కొత్తవి ఏవి వస్తాయనే స్పష్టత ఇంకా రాలేదు. వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వస్తే తప్ప అధిక శాతం నిర్మాతలు రిలీజులకు ఎస్ అనడం లేదు.