“మా బ్లడ్ వేరు. మా బ్రీడ్ వేరు” అంటూ గొప్పలు చెప్పుకున్న ఎన్టీఆర్ వారసులు ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన పట్ల వివిధ వర్గాల నుండి సానుకూల స్పందన వస్తోంది. కానీ ఎన్టీఆర్ వారసుల్లో మాత్రం ఆ స్పందన కనిపించడం లేదు. దగ్గుబాటి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించినా అదేదో జనం కోరిక తీరినట్టు రెండు మాటలు రాసేసి ఊరుకున్నారు తప్ప ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. అలాగే ఇటువంటి చారిత్రక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కనీసం అభినందించడమో, కృతజ్ఞతలు తెలపడమో చేయలేదు.
మరోవైపు హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అంటూ ఒక వీడియో విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు బ్లడ్, బ్రీడ్ గురించి మాట్లాడే బాలకృష్ణ. హిందూపూర్ గురించి మాట్లాడే సందర్భంలో అయినా విజయవాడ జిల్లాకు తన తండ్రి పేరు ప్రతిపాదించడం పట్ల ఆయన కనీస స్పందన చూపించలేదు. అసలు విజయవాడను ఒక నూతన జిల్లాగా ప్రకటించడం కానీ, దానికి తన తండ్రి పేరు ప్రతిపాదించడం కానీ తనకు తెలిసినట్టుగా అయినా ఆయన కనిపించలేదు.
హిందూపూర్ తప్ప మిగతా విషయాలు తనకు పట్టవు అన్నట్టు ఉంది ఆయన ధోరణి. ఎన్టీఆర్ వారసులం అంటూ తరచూ చెప్పుకునే బాలకృష్ణ ఈ విషయంలో మౌనంగా ఉండడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించే అంతటి విశాల హృదయం తమకు లేకపోయినా కనీసం తండ్రిపేరు ప్రతిపాదించడాన్ని స్వాగతించడం కూడా ఇష్టంలేనట్టు కనిపించడం శోచనీయం.
ఎన్టీఆర్ వారసులు ఇటీవలే ఒక వేదికగా ఉమ్మడిగా గొంతు విప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకేదో అవమానం జరిగిందని మీడియా ముందు బోరున విలపించగానే మొత్తం ఎన్టీఆర్ కుటుంబం ఒక ఇంట్లో సమావేశం అయి ఖండించారు. హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే చంద్రబాబు కన్నీరు పెడితేనే ఎన్టీఆర్ వారసులు నోరు విప్పుతారా? ఎన్టీఆర్ కు గౌరవం లభిస్తే నోరు విప్పరా? కనీసం ఓ చిన్న ప్రస్తావన కూడా చేయరా? లేక చంద్రబాబు అనుమతి లేనిదే మాట్లాడే సాహసం కూడా చేయరా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
దేశ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమకు ఆదర్శంగా కొందరు నేతలను ఎంచుకోవడం పరిపాటే. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంలోని నేతలను ఆదర్శంగా ఎంచుకుంటే, భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ నేతలను ఆదర్శంగా ఎంచుకుంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్దార్ పటేల్ ను బీజేపీ సొంతం చేసుకుంది. సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని నిలబెట్టి ఆయనకు నిలువెత్తు గౌరవం ఇచ్చింది. ఇప్పుడు పటేల్ కూడా సంఘ్ పరివార్ నేతలతో సమంగా బీజేపీ నుండి గౌరవాన్ని పొందుతున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ విజయపథంలో నడుస్తోంది. మరోవైపు టీడీపీ తన వ్యవస్థాపక నేత ఎన్టీఆర్ ను ఆదర్శంగా రాజకీయాలు నడుపుతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకు ప్రతిపాదించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్టీఆర్ ను గౌరవించింది. కాంగ్రెస్ నుండి పటేల్ బీజేపీ కో సొంతం అయినట్టు, టీడీపీ నుండి ఎన్టీఆర్ వైసిపి ఖాతాలోకి చేరకపోవచ్చు,వైసీపీ కూడా ఎన్టీఆర్ పేరు రాజకీయంగా ఉపయోగించుకోక పోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచే ఎన్టీఆర్ వారసులు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. తండ్రికి లభించిన గౌరవాన్ని కూడా వారు ప్రస్తావించే పరిస్థితి కనిపించడం లేదు.