మాంసాహారం.. కారణం ఏదైనా వినియోగం మాత్రం యేటేటా పెరిగిపోతోంది. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తక్కువ ఖర్చుతో సమకూర్చుకోవాలంటే మాంసాహారం తప్పని సరి అనే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో మాంసా హారం కారణంగా పర్యావరణ పరంగా ఇబ్బందులు పెరిగిపోతున్నాయని, మానవాళికి ఇది ఆరోగ్యకరమైన ఆహారం కాదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వారి వారి వేదికలకు ఉండే బలాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో వాదన మనకు కొత్తగా.. అప్పుడే వింటున్నట్టుగా.. అన్పిస్తూ ఉంటుంది.
దేశం మొత్తం మీద వినియోగదారుడి వైపు నుంచి ఆలోచించేటంతటి తీరిక ప్రభుత్వాలకు ఎప్పుడూ లేదు. ఇది అనేక అంశాల్లో ఇప్పటికే పలు మార్లు వెల్లడవుతూనే ఉంది. ముఖ్యంగా ఆహార సంబంధిత వస్తువుల నాణ్యత విషయంలో వినియోగదారుల హక్కులకంటే.. వ్యాపారుల వ్యాపారానికే అవకాశాలు ఎక్కువనడంలో ఎటువంటి ఆశ్చర్యం ఉండదు.
ప్రతి యేటా మాంసాహార వినియోగం పెరుగుతోంది.. తద్వారా ప్రభుత్వాలకు, సదరు వ్యాపారులకు అందాల్సిన టాక్సులు, లాభాలు అందుతూనే ఉన్నాయి. కానీ సదరు ఆహారాన్ని వినియోగించుకునే వ్యక్తుల ఆరోగ్యానికే ఎటువంటి హామీ అందడం లేదు. తాము ఎంతో ఇష్టపడి తెచ్చుకుని తింటున్నది నాణ్యమైనదేనా? కాదా? అన్నది ఎవ్వరికి వాళ్ళు స్వయంగా పరీక్షించి తెల్సుకోవాల్సిందే అంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ ఆరోగ్య మరియు కుటుంబ వ్యవహారాల శాఖ పర్యవేక్షణలో పనిచేస్తుంటుంది. ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైనా ఒక జంతువును వధించాలంటే 48 గంటల ముందు సంబంధిత కబేళాలోని పశువైద్యుడు పరీక్షించి, ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్దారించి, ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఈ ధృవీకరణ పత్రం ఆధారంగా జంతువును వధించి, పోస్టుమార్టం ద్వారా ఆరోగ్యంగానే ఉన్నట్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. అప్పుడు దుకాణానికి తీసుకువచ్చి అమ్మకాలు చేపట్టాలి. ఒక వేళ మాంసం మిగిలిపోతే మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కేవలం కొన్ని గంటలు మాత్రమే భద్రపరచాలి.
ఆరోగ్య విభాగం అధికారులు దుకాణాలను పరిశీలించి, ధృవీకరణ ముద్ర ఉన్న మాంసాన్నే అమ్ముతున్నారా? లేదా? అన్నది పరీక్షిస్తూ ఉండాలి. కానీ ఇవేవీ ఎక్కడా జరుగుతున్న, కనీసం చూసిన దాఖలాలు కూడా కన్పించవు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత అధ్వాన్నమనే చెప్పాలి. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లోనే ఇటీవలే అధికారులు జరిపిన దాడుల్లో పది, పదిహేను రోజుల నుంచి నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నుట్ట బైటపడింది. ఇదే మాంసంతో పలు హోటళ్ళు, రెస్టారెంట్లు వివిధ రకాల వంటకాలు వండి అమ్ముతున్నట్టుగా తేలడంతో అంతా ఉలిక్కిపడ్డారు. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్న, మధ్య తరహాపట్టణాలు, పల్లెల మాట ఏంటి? అన్నది ఊహిస్తేనే ఒళ్ళు జలదరించకమానదు.
వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలే కాకుండా ప్రాణం పోయే పరిస్థితికి కూడా నిల్వ మాసం కారణమవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ తిన్నవెంటనే ప్రాణం పోకపోయినా.. దీర్ఘకాలంలో అంతర్గతంగా కీలక అవయవాలైన కిడ్నీ, లివర్ వంటివి దెబ్బతింటాయని, తద్వారా తీవ్ర అనారోగ్యం భారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. గోధుమ, నీలం రంగుల్లో ఉండి, ముట్టుకుంటే జిగురు స్వభావం కన్పిస్తే అది నిల్వ మాంసంగా గుర్తించొచ్చని చెబుతున్నారు. ఫ్రెష్‌గా సిద్దం చేసిన మాంసానికి ఎటువంటి వాసన ఉండదని, గులాబీరంగులో ఉంటుందని ఈ తేడాలను గమనించి మాంసం కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
కాగా నాణ్యత పరిశీలన ప్రజలమీదనే విడిచిపెట్టేయకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. వీటిని పర్యవేక్షించేందుకు గ్రామీణ స్థాయి నుంచి బాధ్యతలు నిర్వర్తించే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి వంటి వారిని బాధ్యులను చేస్తూ కఠిన నిబంధనలను అమలు చేయాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.