బాలీవుడ్ నిర్మాతలకు జరుగుతున్నదేదీ అంతు చిక్కడం లేదు. లాక్ డౌన్ క్రమంగా తీసేస్తూ వచ్చినా కూడా థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో విడుదల తేదీల విషయంలో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో కరోనా మొదటిసారి దాడి చేసినప్పటి నుంచి మొదలుకుని ఇప్పటిదాకా ఏడాది గడిచిపోతున్నా ఒక్కటంటే ఒక్కటి పేరున్న స్టార్ హీరో సినిమా ఏదీ విడుదల చేయలేకపోయారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రతిసారి కేసుల విషయంలో అగ్ర స్థానంలో ఉండటంతో జనం హాళ్లకు రారనే అనుమానంతో పాటు ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో అలా వెయిటింగ్ లోనే నెలలు గడిచిపోయాయి.
పోనీ ఇప్పుడైనా రిలీజులు చేసుకుందామా అంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. థర్డ్ వేవ్ తో పాటు డెల్టా వేరియంట్ తాలూకు కేసులు మెల్లగా నార్త్ సైడ్ మొదలయ్యాయి. ఇప్పుడు థియేటర్లు తెరిచినా తక్కువ గ్యాప్ లో మళ్ళీ మూసివేయాల్సి వస్తుందనే భయం ఎగ్జిబిటర్లలో నెలకొంది. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరోవైపు ఓటిటి డైరెక్ట్ రిలీజులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అజయ్ దేవగన్ భారీ చిత్రం భుజ్ ని వచ్చే నెల హాట్ స్టార్ లో ప్రీమియర్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరికొన్ని కూడా ఇదే బాట పట్టడం తప్ప వేరే మార్గం
జులై 27 థియేటర్లలోనే వస్తానన్న అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు ముంబై మీడియా టాక్. సూర్యవంశీ, 83 లాంటి భారీ చిత్రాలు ల్యాబులోనే మగ్గుతున్నాయి. మతులు పోయే ఓటిటి ఆఫర్లు వస్తున్నా నిర్మాతలు ఇప్పటిదాకా సహనంతో ఉంటూ వచ్చారు. ఒకవేళ థర్డ్ వేవ్ అంటూ వచ్చి మళ్ళీ కేసులు పెరిగితే ఎలా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. సల్మాన్ ఖాన్ రాధే జీ5 లో డిజాస్టర్ కావడం వల్ల కొందరు వెనక్కు తగ్గిన మాట వాస్తవమే కానీ ఇదే పరిస్థితి ఇంకో మూడు నాలుగు వారాలు కొనసాగితే మాత్రం బాలీవుడ్ భారీ సినిమాలు జై డిజిటల్ అనక తప్పేలా లేదు