అదుగో పులి ఇదుగో తోక తరహాలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయని వినడమే తప్ప అసలు ఎప్పుడు గేట్లు తెరుచుకుంటాయో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎగ్జిబిటర్లు సరే నిర్మాతలు కూడా ఈ విషయంగా నోరు విప్పడం లేదు. తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ కనీసం మల్టీ ప్లెక్సుల్లో అయినా షోలు వేసే సూచనలు కనిపించడం లేదు. ఏపిలో వైజాగ్, అనంతపురం లాంటి ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా సినిమాలు ప్రదర్శిస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు థియేటర్లలో పని చేసే సిబ్బంది రోడ్డెక్కుతున్నారు. తమ ఉపాధికి గండి కొడుతూ ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తారని హైదరాబాద్ లో ధర్నా కూడా చేశారు. అయినా కూడా ఎలాంటి కదలిక లేదు.
మరోవైపు ఇప్పటిదాకా కేవలం మూడు సినిమాల ప్రకటనలు మాత్రమే వచ్చాయి. జులై 30న తిమ్మరుసు, ఆగస్ట్ 6న ఎస్ఆర్ కల్యాణ మండపం, ముగ్గురు మొనగాళ్లు మాత్రమే షెడ్యూల్ చేశారు. పెద్ద హీరోలవి సరే కనీసం మీడియం రేంజ్ స్టార్లవి సైతం మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న టక్ జగదీష్, లవ్ స్టోరీ, సీటీ మార్ లు కనీసం హింట్ కూడా ఇవ్వడం లేదు. అసలు వచ్చే నెల అయినా ప్రేక్షకుల ముందుకు తెస్తారా అంటే అనుమానంగానే ఉన్నాయి. ఆగస్ట్ మొత్తం చిన్న సినిమాలకు వదిలేసి ఆపై సెప్టెంబర్ నుంచి ఒక్కొక్కటిగా భారీ చిత్రాలు రిలీజ్ చేసేలా ఆ ప్రొడ్యూసర్లు ప్లానింగ్ లో ఉన్నారట
కానీ అప్పటిదాకా కేవలం చిన్న సినిమాలతో థియేటర్లకు ఫీడింగ్ చాలా కష్టం. అదే పనిగా వీటి కోసం ఫ్యామిలీలు హాలు దాకా రావు. ఎక్స్ ట్రాడినరీ టాక్ వస్తే తప్ప. అలా జరిగే ఛాన్స్ ఎంతమేరకు ఉందంటే చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆక్యుపెన్సీ నిబంధన కూడా అగ్ర నిర్మాతలను తొందరపడనీయకుండా చేస్తోంది. థర్డ్ వేవ్ గురించి వార్తలు, అలుముకున్న భయాలు మరో కారణంగా చెప్పొచ్చు. మూడు నెలలకు పైగా మూతబడిన థియేటర్లకు మంచి రోజులు వచ్చాయనుకుంటే లాక్ డౌన్ అయ్యాక కూడా పరిస్థితిలో మార్పు లేదు. దీనికి పరిష్కారం ప్రభుత్వం నుంచి జరగాలా లేక ఇండస్ట్రీ నుంచా అంటే సమాధానం చెప్పడం కష్టం