ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణంపై ఎన్జీటీ తీర్పు వెలువడింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకండా రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని నియమించింది. నాలుగు నెలల్లో ఆ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు సాగు, తాగు నీటి అవసరాలకు సరిపడా నీటిని తరలించలేకపోవడంతో వరద జలాలు వృధా అవుతున్నాయి. ఏటా శ్రీశైలంలో మిగులుజలాలు విడుదల చేస్తున్నప్పుడు దిగువన నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వంటివి నిండిపోయి వందల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. ఓవైపు రాయలసీమలో సాగునీటి సమస్య కొనసాగుతున్న దశలో రెండోవైపు ఏటా ఇలా విలువైన జలాలు వృధా కావడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన మూడేళ్లుగా కృష్ణా జలాలు 2వేల టీఎంసీలకు పైగా సముద్రం పాలయ్యాయి. దానిని అరికట్టి వరదల సమయంలో కొద్దిపాటిగానైనా కృష్ణా జలాలు వినియోగించుకోవాలనే సంకల్పంతో రాయలసీమ లిఫ్ట్ కి శ్రీకారం చుట్టింది.
Also Read : ప్రత్యేకహోదా – ఆంధ్రాకు కుదరదు, బీహార్ కు మాత్రం …
రాయలసీమ లిఫ్ట్ ద్వారా తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవా కాలువకు సాగు, తాగు నీటి అవసరాలను పరిధి మేరకు పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణంపై తెలంగాణా నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో టీడీపీకి చెందిన కొందరు నేతలు కూడా ఎన్జీటీకి ఫిర్యాదు చేయడం విస్మయకరంగా మారింది. ఏపీకి వ్యతిరేకంగా పలు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా నీటిపారుదల శాఖ కొర్రీలు వేస్తున్న సమయంలో టీడీపీ నేతలు కూడా అదే రీతిలో వ్యవహరించడం సీమ వాసులను విస్మయానికి గురిచేసింది.
రాయలసీమ లిఫ్ట్ పై ఇప్పటికే కేఆర్ఎంబీ బృందం పరిశీలన చేసింది. ఇరిగేషన్ నిపుణుల బృందం రిపోర్ట్ ఎన్జీటీకి చేరింది. అయితే ఫిర్యాదుదారుల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనివార్యం అంటూ ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకూడదని ఆదేశించింది. అదే సమయంలో గతంలో ఎన్జీటీ బెంచ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఓ సెక్షన్ మీడియా వక్రీకరించగా తాజాగా ఎన్టీటీ తీర్పులో స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించినందుకు చీఫ్ సెక్రటరీని కూడా అరెస్ట్ చేస్తారంటూ కథనాలు వచ్చాయి. కానీ అలాంటి పరిస్థితి లేదని ఎన్జీటీ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొంది. దాంతో మరోసారి పచ్చ మీడియా కథనాల తీరు తేటతెల్లమయ్యింది. కోర్టులు, ఎన్జీటీ లాంటి ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా వక్రీకరించే పనిలో ఉన్నారని స్పష్టమయ్యింది.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లినందున ఈ వ్యవహారం త్వరగా కొలిక్కి రావాలని సీమ వాసులు కోరుతున్నారు. వృధాగా పోతున్న జలాల వినియోగానికి జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలు ఫలిస్తే కొంత ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నారు.
Also Read : నిజమే…. మన పోల‘వరం’ – గోదావరి డెల్టాలో రబీకి 17 టీఎంసీల నీరు