ప్రధానంగా వ్యవసాయాధారితమైన మన రాష్ట్రానికి ఈ పేరు రావటానికి ముఖ్య కారణం వరి సాగు .ఈ వరి సాగులో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం అని చెప్పొచ్చు . దేశవ్యాప్తంగా దాదాపు 60 రకాల వరి వంగడాలు ఉండగా మన రాష్ట్రంలో , ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా సన్న బియ్యంగా పేరు పడ్డ బీపీటి వంగడాన్నే పండిస్తారు . కొంత విస్తీర్ణంలో బాస్మతీ రకం సాగు చేస్తారు . ఇతర రకాలు అరుదుగా మాత్రమే చూడగలం.
అయితే ఇటీవల ప్రకృతి సేద్యం , ప్రాచీన వంగడాల పట్ల , వాటిలోని పోషక విలువలు , పలు వ్యాధుల్ని అదుపులో ఉంచే ఎంజైమ్స్ , విటమిన్ , ప్రోటీన్ లాంటి వాటి పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి పెరగడం మూలంగా ప్రస్తుత తరానికి తెలియని పలు ప్రాచీన భారతీయ వంగడాలు వెలుగులోకి వచ్చాయి . వాటిలో ఒకటి కాలా బట్టీగా పిలవబడే బ్లాక్ రైస్ .
మహిళల్లో వచ్చే పలు రకాల కాన్సర్ లను అదుపు చేసే ఆంధోనియాసిన్ అనే యాంటీబయాటిక్ ఈ నల్ల బియ్యంలో పుష్కలంగా లభ్యమవుతుందట .
సాధారణ వరి వంగడాలతో పోలిస్తే ఈ నల్ల బియ్యంలో ఫైబర్ , విటమిన్ ఇ తో పాటు జింక్ , కాల్షియం లాంటి ఖనిజ పోషకాలు కూడా ఎక్కువే అంటున్నారు పరిశోధకులు . ఈ కారణాల వలన ప్రధానంగా క్యాన్సర్ ముప్పు ఎదుర్కొనే మహిళలకు , డయాబెటిక్ , బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారికి , ఒబేసిటీ బాధితులకు ఉత్తమ ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు .
Also Read:అమరావతి పరిరక్షణ సమితి వర్సెస్ సచివాలయ ఉద్యోగులు
ప్రధానంగా అస్సాం మరికొన్ని ఉత్తర రాష్ట్రాల్లో సాంప్రదాయ వ్యవసాయం చేసే రైతులు ఇప్పటికీ ఈ బ్లాక్ రైస్ సాగు చేస్తుండగా వీటిలోని పోషక విలువలు పై పలు పరిశోధనల ఫలితాలు వెలువడ్డాక పలు రాష్ట్రాల్లో ఔత్సాహిక రైతులు ఈ సాగుని చేపడుతుండగా మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో , మరికొన్ని ప్రాంతాల్లో కొందరు రైతులు గత ఏడాది సాగు చేసి సత్పలితాలు సాధించారు .
చీడపీడలు ఆశించని , ఎరువులు పురుగు మందులు అవసరం లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగు చేసే ఈ బ్లాక్ రైస్ వంద రోజుల్లో చేతికొచ్చే పంట . ఈ బ్లాక్ రైస్ సాగు గురించి తెలుసుకున్న వ్యవసాయ మంత్రి కన్నబాబు గారు దీన్ని మరింత విస్తృతంగా రైతుల చేత సాగు చేయించే ఉద్దేశ్యంతో తూర్పు గోదావరి జిల్లా మడపేటలో కొందరు రైతుల ద్వారా ప్రకృతి , ఆధునిక వ్యవసాయ పద్దతుల మేళవింపుతో సాగుకు శ్రీకారం చుట్టించారు .
తొలుత విత్తనాలు తెప్పించి నారు మడుల్లో పెంచిన తర్వాత ఈ నెల 27 వ తారీఖున పాపారాయుడు అనే రైతు పొలంలో వరినాటు యంత్రం సహాయంతో దగ్గరుండి పర్యవేక్షిస్తూ నాట్లు వేయించారు వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించే రైతుకు తగ్గ ప్రతిఫలం దక్కించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని , వ్యవసాయంలో రైతులకు ఉపకరించే యంత్రాల కోసం 1700 కోట్లు కేటాయించామని ఆ నిధులతో రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు కొనుగోలు చేసి ఆర్ బి కే ల్లో అందుబాటులో ఉంచుతామని , అలాగే ప్రతి రైతుకి ఆర్ బి కేల ద్వారా గిట్టుబాటు ధర అందిస్తామని తెలిపారు .
Also Read: జేసీకి హైకోర్టులో చుక్కెదురు..!
మరో వైపు విశాఖ ఏజెన్సీలో ప్రయోగాత్మకంగా చేయించిన బాస్మతీ వరి సాగు విజయవంతమైందని తెలిపారు . వరి సాగుకు అంతంత మాత్రం అనుకూలించే ఏజెన్సీ ప్రాంత రైతులకు లాభం కలిగించటమే ధ్యేయంగా ఆ ప్రాంతానికి అనుకూలంగా వుండే వంగడాల కోసం చింతపల్లి వ్యవసాయ పరిశోధక కేంద్రం పలు పరిశోధనల తర్వాత అభివృద్ధి చేసిన బాస్మతి తరహా పిబి 1 , సుగంధమతి అనే వరి రకాలను ట్రయిల్ రన్ గా కొందరు ఏజెన్సీ రైతుల పొలాల్లో సాగు చేయించగా ఎకరాకు షుమారు 20 బస్తాల చొప్పున దిగుబడి వచ్చిందని వ్యవసాయ క్షేత్ర సహాయ సంచాలకులు
డి .జి . రామారావు తెలిపారని ఈ స్పూర్తితో రాబోయే కాలంలో మరింత మంది ఏజెన్సీ రైతుల్ని ఈ బాస్మతీ వంగడాల సాగుకు ప్రోత్సహించి వారి ఆదాయాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు .