పెళ్లంటే భారీ సెట్టింగులు, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, ఖరీదైన బహుమతులు.. ఇప్పుడు సాధారణంగా మారింది. శుభలేఖలోనే తమ దర్పం ప్రదర్శించుకోవడానికి చాలా మంది తహతహలాడుతుంటారు. హంగూ, ఆర్భాటాల కోసం లక్షలు వెచ్చిస్తారు. అతిథులకు ఘనంగా ఆహ్వానం పలికేందుకు ఆరాటపడుతుంటారు. కొందరైతే తమకు పరిచయమున్న రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కావడం కోసం పెళ్లి ముహార్తాలను కూడా వారిని అడిగే పెట్టుకుంటారు. ఇలాంటి తరుణంలో ఓ జంట తమ పెళ్లి ద్వారా ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఏదైనా కార్యక్రమం చేయాలని తలపించింది. ఇప్పటికే చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు చేయూత అందిస్తున్న ఆ వరుడి కోరికను వధువు కుటుంబసభ్యులు కూడా అంగీకరించడంతో వివాహ వేదికలో రక్తదాన శిబిరం ఏర్పాటయింది. తమ పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు రక్తదానం చేయాలని ఆ దంపతులు కోరడం ఆసక్తికరంగా మారింది.
పెళ్లి శుభాకాంక్షలు దయచేసి ఇలా తెలపండి..
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన దయాసాగర్, పద్మసాయి కృష్ణవేణిల వివాహం పట్టణంలోని పెద్దబజారులో ఉన్న రామకృష్ణ కల్యాణమండపంలో ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చేవారు రక్తదానం చేయాలని వారు కోరారు. ముందుగానే ఈ విషయాన్ని శుభలేఖలలోనే ప్రస్తావించారు. బహుమతులు, కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు.. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని విన్నవించారు. మాకు అదే పెద్ద బహుమతి అని, ఆశీర్వాదాలు అని అభిలాషించారు. ఈ మేరకు వివాహ వేదిక వద్ద రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎం.రవికుమార్, సభ్యులు సియాదుల శ్రీమన్, ఆలిమ్, శివ, అజహర్, చామంతి నాగేశ్వరరావు, వాకాడ వెంకటరమణ, పవన్ కల్యాణ్, నాగేంద్ర కూడా సహకారం అందించారు. రక్తదానం గురించి శుభలేఖల ద్వారా ముందే గమనించిన కొందరు అందుకు సిద్ధమై వచ్చారు. మరికొందరు పెళ్లిక వచ్చాక నూతన దంపతుల కోరికను మన్నించి రక్తదానం చేశారు. 32 మంది వరకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. చేయూత స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్‌గా పేదలకు సేవలందిస్తున్న దయాసాగర్.. తన పెళ్లి వేడుకను కూడా సామాజిక కార్యక్రమానికి వేదికగా మార్చడాన్ని పలువురు అభినందించారు.