కరోనా… సరిగ్గా ఏడాది క్రితం చైనాలో వెలుగు చూసింది. చైనా నుండి ప్రపంచ దేశాలకు వైరస్ వ్యాపించింది. ప్రపంచాన్ని తన ఉక్కు పిడికిలిలో బందీ చేసింది. ఉరుకులు పరుగులు తీసే ప్రపంచాన్ని ఇంటిలో కూర్చోబెట్టింది. కొన్ని కోట్ల మందికి వైరస్ సోకగా సుమారు 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 49 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఏదొక పనిలో పొట్ట నింపుకోవడానికి ప్రయత్నించిన వారే అధికం. తాజాగా ఒకప్పుడు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించి ఒక వెలుగు వెలిగిన ఇద్దరు క్రీడాకారులు కరోనా మహమ్మారి కారణంగా దయనీయమైన స్థితికి చేరుకున్నారు.
రూబెన్ లిమార్డో సైకిల్‌పై వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులను అందించే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఎందరో డెలివరీ అందించే పని చేస్తుంటారు ఇందులో విశేషం ఏముంది అనుకోవద్దు. తాను ఒక దేశానికి ఒలింపిక్స్‌లో బంగారు పతకం అందించిన వ్యక్తి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఉబెర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. 1904 వ సంవత్సరం తర్వాత వెనెజులా దేశానికి 2012 ఒలింపిక్స్‌లో, ఫెన్సింగ్‌లో స్వర్ణ పతకం అందించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించిన రూబెన్ లిమార్డోకు కరోనా మహమ్మారి పెద్ద షాక్ ఇచ్చింది.
పలు కంపెనీలు నష్టాల బాట పట్టడంతో తమకు అందే ప్రోత్సాహకాలు నిలిచిపోవడం వల్ల ఉపాధి కోసం డెలివరీ బాయ్‌గా మారాల్సి వచ్చింది. ఈ పని ద్వారా వారానికి 9 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు రూబెన్ వెల్లడించారు. 2021టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్‌లో కూడా ఆయన తన దేశం తరపున పాల్గొనబోతుండడం గమనార్హం.
నెదర్లాండ్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ కూడా కరోనా కారణంగా ఉబర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. నెదర్లాండ్ దేశ బౌలర్‌గా 5 వన్డేలు, 39 టీ20లు ఆడిన పాల్ వాన్ t20ల్లో 47 వికెట్లు సాధించాడు. కరోనా కారణంగా పలు క్రికెట్ సిరీస్ లు వాయిదా పడ్డాయి. ప్రపంచకప్ కూడా వాయిదా పడింది. దాంతో ఈ నెదర్లాండ్ క్రికెటర్ కు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధి కోసం డెలివరీ బాయ్ గా మారాల్సివచ్చింది.
కరోనా లేకపోతే మెల్బోర్న్ మైదానంలో ఫైనల్‌ను వీక్షించేవారిమని ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫో ఆదివారం ట్వీట్ చేసింది. దీన్ని పాల్ వాన్ రీట్వీట్ చేస్తూ ఈ రోజు క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ, ప్రస్తుతం శీతకాలం నెలల్ని గడిపేందుకు ఉబర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. విధి ఎంతో విచిత్రమైనది. పరిస్థితుల్ని మార్చేస్తుంది. అయినా నవ్వుతూ మనం ముందుకు సాగిపోవాలి అని పాల్ వాన్ చేసిన రీ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రముఖులే ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం అని నిపుణులు అంటున్నారు. ఉరుకులు పరుగులు పెడుతున్న ప్రపంచాన్ని ఇంటికి పరిమితం చేసిన కరోనా ప్రభావం తగ్గాలంటే మరి కొన్నేళ్ళు ఎదురు చూడాల్సిందే..