టీడీపీ నాయకుడిగా, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని తహతహలాడుతున్న నారా లోకేష్ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అనుకూలతను కూడా అందిపుచ్చుకోలేని ఆయన బలహీనతలు కారణంగా రానురాను ప్రజల్లోనే కాకుండా పార్టీలో కూడా ఆయన పలుచన అవుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఆయన పూర్తిగా శవం గురించి సమాచారం రాగానే అప్రమత్తమవుతున్నారు. పరామర్శల పేరుతో రాజకీయ యాత్రలకు సిద్ధమవుతున్నారు. కానీ వాటి నుంచి ఆశించిన ఫలితం రాకపోవడంతో చివరకు ఢీలా పడాల్సి వస్తోంది.
తాజాగా విశాఖలో డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించిన ఘటనను రాజకీయం చేసేందుకు టీడీపీ నేతలు ఎంతో ప్రయత్నించారు. కానీ స్వయంగా సుధాకర్ తన ధోరణి పట్ల ఇప్పటికే పశ్చాత్తాపం ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ డ్రామా పెద్దగా రక్తి కట్టలేదు. అయినప్పటికీ నారా లోకేష్ నేరుగా సుధాకర్ ఇంటికి వెళ్లి కొంత ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.
వాస్తవానికి సుధాకర్ కన్నా ముందు టీడీపీ జెండా మోసిన అనేక మంది నేతలు ఇటీవల విశాఖలో మరణించారు. ఆపార్టీ భీమిలి అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా, పార్టీ తరుపున గట్టిగా గొంతు విప్పిన సబ్బం హరి కూడా రెండు వారాల క్రితమే మృతి చెందారు. అయినా పార్టీ కోసం పనిచేసిన కుటుంబాలను కనీసం పరామర్శించాలన్న ధ్యాస కూడా లోకేష్ కి లేదు. తమ కోసం పనిచేసిన కార్యకర్తల మీద ఆయన శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. కానీ అదే సమయంలో డాక్టర్ సుధాకర్ విషయంలో మాత్రం హుటాహుటీన విశాఖ వచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడం పార్టీ శ్రేణులకే మింగుడుపడలేదు.
లోకేష్ తాజా పర్యటనకు అనేక మంది దూరంగా ఉన్నారు. ఇటీవల మరణించిన టీడీపీ అధికార ప్రతినిధి సనపల పాండు రంగారావు, ఇమంది రమణ(ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు), 31 వార్డు నుంచి టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్, కామాకుల నాగేశ్వరరావు(ఎన్నికల్లో 52వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి పరాజయం పొందారు.) వంటి వారికి కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వని లోకేష్ డాక్టర్ సుధాకర్ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం వెనుక కారణాలు గ్రహించి నేతలు మొఖం చాటేశారు.
మొత్తంగా లోకేష్ ఆశించిన దానికి భిన్నంగా ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి పొలిటికల్ డ్రామాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన గ్రహించడం మేలు. నిజంగా ప్రజా సమస్యల్లో స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప కృత్రిమ సానుభూతి యత్నాలు చెల్లవని తెలుసుకోవడం ఉత్తమం అంటూ టీడీపీ నేతలే సూచిస్తున్నారు.