ఏం చేసినా చెల్లుతుంది.. అన్న భావనకు పరాకాష్టగానే టీడీపీ యువరాజు నారా లోకేష్ చేసిన పనిని ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇటువంటి భావన ఉండకూడనిదే అయినప్పటికీ, అధికారం మత్తులో అది ఆవహించేసి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అధికారం దిగాక జరిగే పరిణామాలు మాత్రం చట్ట పరిధికి లోబడి ఉండడంతో ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏ పని జరిగినా దానికి నిర్ధిష్టమైన విధానం ఉంటుంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణలో, ఆయా శాఖల మంత్రులు సంతకం చేయడం సర్వసాధారణం. ఒక వేళ ముఖ్యమంత్రే సంతకం చేసినప్పటికీ, ఆ శాఖ మంత్రి సంతకం కూడా తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది.
అధికారంలో కొచ్చింది మొదలు అన్నీ తమకు ఇష్టమొచ్చినట్టే చేసారన్న దానికి నిదర్శనంగా ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో ప్రస్తుతం వెలుగు చూస్తున్న విస్తుపోయే నిజాలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన దగ్గర ఉన్న శాఖకు సంబంధించిన ఫైలుపై, అసలు ఆ శాఖకు సంబంధమే లేని ఐటీ, పంచాయతీరాజ్శాఖలను పర్యవేక్షించిన లోకేష్ సంతకం పెట్టినట్లుగా ఫైల్లోని అంశాలు వెలుగు చూసాయి. దీన్ని బట్టే చంద్రబాబు హయాంలో అప్రకటిత యువరాజుగా లోకేష్ చేసిన అఘాయిత్యాలు ఏ స్థాయిలో ఉండేవో అర్ధం చేసుకోవచ్చు. సాక్ష్యాత్తు సీయం పెట్టాల్సిన సంతకాన్ని తానే పెట్టేసిన నేపథ్యంలో ఇతర శాఖల మంత్రుల పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవచ్చు.
‘‘నా శాఖలో అతి చిన్న ఉద్యోగిని కూడా బదిలీ చేయలేకపోతున్నాను.. నాకు తెలియకుండానే ఫైళ్ళన్నీ వచ్చి వెళ్ళిపోతున్నాయి..’’ అంటూ తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన ఓ మంత్రి అప్పట్లో సన్నిహితుల వద్ద వాపోయేవారని ఇప్పుడు జనం గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఓ కీలక పదవిని కట్టబెట్టిన సదరు నాయకుడ్ని ఉత్సవ విగ్రహం మాదిరిగానే ఉపయోగించుకుంటున్నారని విపరీతంగా ప్రచారం కూడా జరిగిందని వివరిస్తున్నారు.
ప్రస్తుతం ఫైబర్ గ్రిడ్ సంతకం విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటే, అప్పుడు జరిగిన ప్రచారాలన్నీ కూడా నిజమేనన్న అంశం బోధపడుతుంది. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను కూడా తనపైతానే చేసుకుంటూ మీడియాకు ఐటమ్‌గా దొరికిపోవడం లోకేష్‌కు ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. అయితే వాటి వల్ల జనంలో పలుచన కావడం తప్పితే ప్రజాధానానికి వచ్చిన ముప్పేమీ లేదు. అయితే శాఖలు మీరి మరీ చేసిన ఇటువంటి ‘సంతకాలు’ కోట్లాది రూపాయల ప్రజాదనంతో ముడిపడి ఉన్నవి. అందులోనూ తానే సంతకం పెట్టేసేటంతటి సాహసానికి దిగారంటే వాటి అత్యవసరం ఎంతో కూడా ఊహించుకోవచ్చు.
ఇప్పటికే ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా పక్కదారి పట్టిన ప్రజాధనం విలువ ఇప్పుడిప్పుడే తేలుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రెండువేల కోట్ల రూపాయల వరకు పక్కదారి పట్టినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో లోతైన విచారణకు సర్వం సిద్ధం చేస్తోంది. అయితే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ప్రెస్మీట్లు పెట్టి పొంతన లేని సమాధానాలు చెప్పడంతోపాటు, తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళతానని బెదిరింపులకు దిగడం ఇక్కడ కొసమెరుపు.