దేశ ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న ముంబైలో అద్భుత ఆతిధ్యానికి చిరునామా ఆ ప్యాలస్. వీవీఐపీలకు బస, హై ప్రొఫైల్ కార్యక్రమాలు, పారిశ్రామిక, వాణిజ్య ఈవెంట్లు.. ఇలా కార్యక్రమం ఏదైనా రాజసం ఉట్టిపడే ఆతిథ్యం దాని ప్రత్యేకత. దశాబ్దాల తరబడి సేవలందిస్తూ ఆర్థిక రాజధానిలో మకుటాయమానంగా వెలుగొందిన హోటల్ రంగ ధ్రువతార ప్రస్తుతం ఆర్థిక వనరుల కొరతతో కొడిగట్టిన దీపంలా మారింది. ఆర్థిక సంక్షోభం ప్రఖ్యాతిగాంచిన ఐదు నక్షత్రాల హోటల్ హయత్ రిజెన్సీని తన సేవలకు తాత్కాలికంగా స్వస్తి పలికెలా చేసింది.
తాత్కాలికంగా మూసివేత
ఆసియన్ హోటల్ (వెస్ట్) గ్రూపునకు చెందిన హయత్ హోటల్ నిర్వహణ, సిబ్బంది జీతాలు యాజమాన్య సంస్థ నిధులు నిలిపివేసిన పరిస్థితుల్లో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హోటల్ వైస్ చైర్మన్, కంట్రీ హెడ్ సుంజె శర్మ వెల్లడించారు. తమ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా నిధులు అందని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హయత్ బుకింగ్ చానల్స్ ద్వారా రూముల అడ్వాన్స్ రిజర్వేషన్లను కూడా బంద్ చేస్తున్నట్లు హోటల్ జనరల్ మేనేజర్ హారదీప్ మార్వా చెప్పారు. ముంబైలోనే కాకుండా దేశంలోనే ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అత్యంత పేరుప్రతిష్టలు పొందిన హయత్ తాత్కాలిక మూసివేత ఆ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కోవిడ్ దెబ్బకు కుదేలు
కోవిడ్ సంక్షోభమే హయత్ మూసివేత నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఆసియన్ గ్రూపునకు చెందిన హోటల్ ను ఫెడరేషన్ ఆ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్స్ ఆ ఇండియా మాజీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ గుప్తా నిర్వహిస్తూ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జనవరి నుంచి మొదలైన కోవిడ్ సంక్షోభం అన్ని రంగాలతోపాటు హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రంగానికి ఆధారమైన పర్యాటక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కోవిడ్ తీవ్రత నెలల తరబడి కొనసాగిన లాక్ డౌన్ల వల్ల పూర్తిగా చతికిలబడ్డాయి.
మళ్లీ కోలుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ మళ్లీ దెబ్బకొట్టింది. ముఖ్యంగా మహారాష్ట్ర.. ముంబై నగరం సెకండ్ వేవ్ వల్ల మరింత దారుణంగా తయారయ్యాయి. అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో హోటళ్ల ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. సిబ్బంది జీతాలు, నిర్వహణకు నిధులు లేక మాతృసంస్థ వైపు చూడాల్సి వచ్చింది. అయితే ఆ సంస్ధ కూడా చేతులు ఎత్తేయడంతో తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నారు. ఆక్యుపెన్సీ ఎంత పడిపోయింది, ఇతర ఆర్థిక వివరాలు వెల్లడించకపోయినా.. సంక్షోభం నుంచి గట్టెక్కి.. విలువైన తమ అతిథులకు సాధ్యమైనంత త్వరలో సేవలు పునరుద్ధరించేందుకు మాతృసంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు వైస్ చైర్మన్ వెల్లడించారు.