హైదరాబాద్ లో వినాయక చవితి అనగానే మొదట గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ వినాయకుడు, అలాగే బాలాపూర్ గణేష్ లడ్డు. ఎంతో చరిత్ర ఉన్న బాలాపూర్ గణేష్ లడ్డు ని దక్కించుకోడానికి చాలా మంది ప్రముఖులు పోటీ పడుతూ ఉంటారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కలిసి ఉండే రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలో ఈ బాలాపూర్ గ్రామం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలు సంబరంగా జరిపి నిమజ్జనానికి ముందు వినాయకుడి లడ్డు వేలం వేస్తారు.
కేవలం హైదరాబాద్ నుంచే కాక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలం పాటలో ఈ లడ్డూను దక్కించుకునేలా వేలం పాట పాడి మరీ దక్కించుకుంటారు. తెలుగురాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డూ చాలా ప్రత్యేకం ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిన తరువాత చాలా చోట్ల వినాయక చవితి వేడుకలు జరుపుకుంటూ వేలం పాటలు ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఎంతో ఘన చరిత్ర ఉన్న బాలాపూర్ లడ్డు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది.
బాలాపూర్ లడ్డు పాడుకుంటే తమకు అన్ని విధాలా కలసివస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటవగా తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడు కొలను మోహన్ రెడ్డి కుటుంబం రూ.450 రూపాయలకి దక్కించుకుంది. ఆ రోజుల్లో 450 రూపాయలంటే మామూలు విషయం కాదు, లడ్డూ పాడుకున్నాక ఆ లడ్డు ప్రసాదంలా తిని కొంత తన పొలంలో చల్లాడు ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసి రావడంతో, ఆ తరువాతే 1995లో పది రెట్లకు అంటే రూ. 4500 లకు మరోసారి వేలంపాటలో లడ్డును దక్కించుకున్నారు. ఆ తరువాత ఆయన దశ తిరిగిందని అంటుంటారు. అలా బాలాపూర్ లడ్డు ఎంతో మహిమ కలదని, పాడుకుంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో ప్రముఖులు సైతం ఆ లడ్డూని దక్కించుకోవడనికి చూస్తుంటారు.
అలా ప్రతి ఏడాది ఘనంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట గత ఏడాది కరోనా కారణంగా జరగలేదు. అయితే ఈ ఏడాది వేలంపాట జరగగా రికార్డు స్థాయిలో 18 లక్షల 90 వేల రూపాయలకు కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డితో కలిసి దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈ లడ్డూను బహుమతిగా ఇవ్వడానికి రమేష్ యాదవ్ సిద్ధం అవుతున్నారు. ఎంతో మహిమ గల ఈ లడ్డూ మంచి మనసున్న తమ నేతకి ఇస్తే ఆయన ద్వారా మరింత మందికి మంచి జరుగుతుందని రమేష్ భావిస్తున్నారు.
ఈ ఏడాది జూన్ నెలలో గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను అధికార వైసీపీ నామినేట్ చేయగా అందులో కడప జిల్లా నుంచి రమేష్ యాదవ్ కూడా పదవి దక్కించుకున్నారు. రమేష్ యాదవ్ తండ్రి వెంకటసుబ్బయ్య 1987లో ప్రొద్దుటూరు మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్గా పని చేశారు, అయితే వైసీపీ ద్వారా తండ్రి బాటలోనే నడుస్తూ సేవా కార్యక్రమాలలో నిమగ్నమయిన రమేష్ యాదవ్ కు జగన్ ఎమ్మెల్సీని చేశారు.ఎమ్మెల్సీ రమేష్ తనకు జగన్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవటానికి బాలాపూర్ లడ్డు ను వేలంలోదాదాపు 19లక్షలకు గెలిచి జగన్ కు బహుమతిగా ఇస్తున్నారు.గత సంవత్సరం తెరాస నేత ఒకరు బాలాపూర్ లడ్డును తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇచ్చారు.
Also Read : జగన్ స్పీడ్ ,యాక్టివ్ అయిన ఎమ్మెల్యే లు..