ప్రభుత్వ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసి, ఉద్యోగ కాలం ముగిసిన వెంటనే టీడీపీ నేతగా మారి. ఎమ్మెల్సీ అయిన పి. అశోక్‌బాబు.. తన పదవికి న్యాయం చేస్తున్నారు. రెండేళ్ల కాలంలో తాము ఇంత మందికి ఉద్యోగాలు కల్పించామని వైసీపీ ప్రభుత్వం రాతపూర్వకంగా చెబుతున్న అంశంపై టీడీపీ నేత అశోక్‌బాబు తన అనుభవాన్ని అంతా రంగరించి విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా..?
తమ ప్రభుత్వం రెండేళ్లు అయిన సందర్భంగా చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగాల కల్పనపై వైసీపీ ఓ బుక్లెట్ ప్రచురించింది. అందులో విభాగాల వారీగా సమాచారం పొందుపరిచింది. రెండేళ్లలో 4,77,953 ఉద్యోగాలను కల్పించామని పేర్కొంది. ఇందులో 1,84262 రెగ్యులర్ ఉద్యోగాలు, 19,701 కాంట్రాక్టు ఉద్యోగాలు, 2,73,990 ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ విధానంలో కలిప్పించామని పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాలు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్, ప్రాథమిక విద్యా విభాగం, శిశుసంక్షేమ శాఖ ఏపీపీఎస్సీ.. ఇలా ఏ ఏ విభాగాల ద్వారా ఏ ఏ ఉద్యోగాలు, ఎన్ని కల్పించామో సవివరంగా అందులోపొందుపరిచింది. ఉద్యోగాల కల్పనపై అబద్ధాలంటూ విమర్శలు చేస్తున్న అశోక్‌బాబు.. ఆ సమాచారం పట్టుకుని తనకున్న పరిచయాలతో నిజమో కాదో తెలుసుకోవచ్చు. లేదంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. వీటికన్నా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులను చూస్తేనే ఉద్యోగాల కల్పన జరిగిందో లేదో అర్థమవుతుంది. ఇవన్నీ పట్టించుకోని అశోక్‌బాబు తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు.
ఇంటికో ఉద్యోగం.. హామీ మరిచిపోయారా..?
2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం, లేదా నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగభృతి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అప్పుడు ఎన్టీవో సంఘం అధ్యక్షుడుగా ఉన్న అశోక్‌బాబుకు ఈ విషయం తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇవ్వగలరా..? లేదా..? అనేది కూడా ఆయనకు తెలియంది కాదు. అయినా ఈ విషయంపై నాడు మాట్లాడని అశోక్‌బాబు.. తాను టీడీపీ గెలుపునకు పని చేశానని ఇటీవల చెప్పుకున్నారు. తన స్వప్రయోజనాల కోసం అశోక్‌బాబు సంఘాన్ని వాడుకున్నారని ఆ తర్వాత ఉద్యోగులకు అర్థం చేసుకున్నారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అటకెక్కించిన ప్రభుత్వంలోనే చేరి ఎమ్మెల్సీ అయిన అశోక్‌బాబుకు వాస్తవంగా కల్పించిన ఉద్యోగాలు కనిపిస్తాయని భావించలేం.
Also Read : అవినీతికి హడలెత్తాయా..? నిజమా పట్టాభి..!?