కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని చౌబేకి పాట్నాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై అగంతకులు ఇంక్ చల్లారు. మంగళవారం ఉదయం ఆయన డెంగ్యూ పేషంట్లను పరామర్శించేందుకు పాట్నాలోని మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్కు వెళ్లారు. ఆయన కారు దిగగానే అగంతకులు ఆయనపై ఇంక్ చల్లి మాయమయ్యారు. ఎల్లో జాకెట్ ధరించిన మంత్రిపైన, ఆయన కారుపైన ఇంక్ మరకలు పడ్డారు. దీంతో చౌబే అట్నించి అటే వెనుదిరిగారు. మీడియాపై ఇంకుచల్లడంతో, కొంత తనపై పడినట్టు మంత్రి చౌబే చెప్పారు. ‘ప్రజాస్వామ్యంపై ఇంక్ జల్లారు’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
కాగా, బిహార్లో గత ఐదు రోజులుగా 1,500 మందికి పైగా డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు. ఇటీవల వంద మందికి పైగా పొట్టనపెట్టుకున్న వరదల అనంతరం ఈ డెంగ్యూ వ్యాధి ప్రబలింది. ముఖ్యంగా పాట్నాలో 900కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి డెంగ్యూ బాధితులను పరామర్శించేందుకు మంత్రి ఆసుపత్రికి వచ్చారు.