అమరావతి అన్న ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టేయకుండా అక్కడ శాసనసభ ను కొనసాగించాలని మిగతా న్యాయవ్యవస్థను కర్నూల్లోనూ, కార్యనిర్వాహక వ్యవస్థను విశాఖలో ఏర్పాటు చేసి మూడుప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అన్ని విభాగాలూ అమరావతిలోనే ఉండాలన్నది తెలుగుదేశం కార్యకర్తలు, భూములుకొన్న బడా కార్పొరేట్ల డిమాండ్.
ఆస్తులు పెరిగినా భౌముల ధరలు పెరిగినా అదంతా తమకే లాభించాలి తప్ప వేరేవారు బాగుపడకూడదు, వేరే ప్రాంతాలకు ప్రాధాన్యం దక్కకూడదు అన్నది వారి ఆలోచన అన్నది ఇప్పటికే స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు , అమరావతి, విజయవాడ ప్రాంత ముఖ్యనాయకుడు కొడాలి నాని ఇంకో కొత్త పాయింట్ లేవనెత్తారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు స్థలాలు ఇస్తాము అంటే టీడీపేవాళ్ళు అడ్డుకుంటున్నారు. అక్కడకు వేరేవాళ్ళు, ముఖ్యంగా పేదలు రావడాన్ని అక్కడి బడా రైతులు, టిడిపి ప్రతినిధులు అడ్డుకుంటున్నారు..అంటే పేదలకు స్థానం లేని చోట అసెంబ్లీ మాత్రం ఎందుకు ? దాన్ని కూడా తీసుకెళ్లి విశాఖలో పెడితే సరిపోద్ది. వేరే ప్రజలను ఆహ్వానించలేని చోట, వేరే ప్రజలకు స్థానం లేని చోట అసెంబ్లీకి కూడా స్థానం వద్దు. మొత్తం తీసేద్దాం అంటున్నారు.
ఆయన ఈవిషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని ఆయన కూడా దీన్ని పరిశీలిస్తానని , మిగతావాళ్ళతో కూడా చర్చింది నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు నాని వెల్లడించారు. అంటే ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడాన్ని, వారి ఉనికిని కూడా అమరావతి ప్రాంత నేతలు సహించకపోవడాన్ని నాని తీవ్రంగా పరిగణిస్తూ మొత్తం తమకే కావాలని పట్టుబట్టి డిమాండ్ చేస్తే వారికి ఉన్నది కూడా దక్కదని, అలిగితే అట్టూ ముక్కా రెండూ ఉండవని స్పష్టం చేశారు. నలుగురితో కలిసి ఉంటామంటే వారికి కూడా గౌరవం ఉంటుందని, అలాకాకుండా మొత్తం తమకే దక్కాలని ఆశిస్తే ఉన్నది కూడా తీసేసి వేరే చోటికి తరలిస్తామని నాని మెత్తగా హెచ్చరించారన్నమాట.