ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలంటారు పెద్దలు. రాజకీయాల్లో ఈ ఫార్ములాను పాటించిన వారికి విజయాలే. ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటి తీరును ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కనబరుస్తున్నారు. నెల్లూరు నగరం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్.. నగర అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై అన్ని పార్టీల నేతలను కలుపుకుని వెళుతూ పూర్తి పరిణితి కలిగిన రాజకీయ నాయకుడుగా ప్రశంసలు అందుకుంటున్నారు.
సమస్యలు పరిష్కరించడం అధికారంలో ఉన్న వారి బాధ్యత. అదే సమయంలో అందరినీ కలుపుకుని, ఉమ్మడి అభిప్రాయంతో ముందుకు సాగితే కలిగే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి వ్యవహరించారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో సమస్యలపై అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడిగా నగరాభివృద్ధికి ముందుకు సాగుదామని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి చొరవను ప్రతిపక్షాలు సైతం అభినందించాయి. స్వయంగా అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ చేసి పిలవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి, జనసేన కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ ని కూడా తాను ఆహ్వానించానని, ఆయన మాత్రం దూరంగా ఉన్నారని మంత్రి సమావేశంలో తెలిపారు.
ఇటీవల నెల్లూరు పరిధిలో ఇసుక తవ్వకాలపై చర్చ సాగుతోంది. విపక్షాలు దానిని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పడం, సమస్య పరిష్కారానికి చొరవ చూపే ఉద్దేశంతో మంత్రి సమావేశం నిర్వహించారు. దానికి అనుగుణంగా అన్ని పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఉమ్మడిగా ముందుకు సాగుదామని నిర్ణయం తీసుకున్నారు.
Also Read : సోము మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారా?
నెల్లూరులో పేదలకు ఇళ్లస్థలాలుగా కేటాయించిన భూములు గత ఏడాది మునిగిపోయిన నేపథ్యంలో ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్ తప్పిదం మూలంగా కొన్ని సమస్యలు తలెత్తాయని, వాటిని సరిదిద్దామని వెల్లడించారు. దానిని కూడా విమర్శలకు పూనుకోవడం తగదన్నారు. ఇసుక విషయంలో తాను చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలను అడ్డుకోవడంలో ఉమ్మడిగా ముందుకు సాగుదామని తెలిపారు.
మంత్రి అనిల్ రాజకీయంగా చాలా దూకుడుగా ఉంటారు. బయట, అసెంబ్లీలోనూ రాజకీయ ప్రత్యర్థులను తన మాటలతో చీల్చిచెండాడుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీకి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటర్లు ఇవ్వడంలో అనిల్‌ది ప్రత్యేకమైన శైలి. ఈ దూకుడుతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుపొందారు. పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించడంతోపాటు.. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానాలు ఇవ్వడంతో వైఎస్ జగన్ కూడా అనిల్‌ను రాజకీయంగా ప్రొత్సహించారు. దూకుడుగా రాజకీయాలు చేయడంతోనే ఆయనకు మంత్రి పదవి కూడా వరించింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత దూకుడుగా ఉన్న అనిల్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ.. ఆ పదవికి తగిన న్యాయం చేస్తున్నారు. పరిణితి కలిగిన రాజకీయాలు చేస్తూ.. చర్చలు, సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. మంత్రి ప్రయత్నాలు నెల్లూరు నగర అభివృద్ధికి దోహదపడతాయనడంలో సందేహం లేదు.
Also Read : అయ్యో డేవిడ్‌రాజు..!