ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే క్రీడలలో క్రికెట్ ఒకటి.అంతర్జాతీయ క్రికెట్లో ఒక్కరోజులో ఫలితం తేలే వన్డేలు ప్రవేశించినప్పటికీ 20వ దశకం వరకు టెస్టులకు ప్రాధాన్యత ఉండేది. అయితే కొన్ని గంటలలో ఫలితం తేలే టీ20 మ్యాచ్‌లు వచ్చాక టెస్ట్ మ్యాచ్‌లు తమ ప్రాముఖ్యతను కోల్పోతూ వచ్చాయి.ఈ నేపథ్యంలో టెస్ట్ పట్ల ప్రేక్షకులలో ఆసక్తి పెంచడానికి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టింది.
అయితే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అనుసరిస్తున్న పాయింట్ల విధానంలో లోపాలను మాజీ వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ ఎత్తి చూపాడు.గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జట్లు 2021 జూన్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి.అయితే ఈ ఛాంపియన్‌షిప్‌లో టెస్ట్ గెలిచిన జట్టుకు వచ్చే పాయింట్ల సంఖ్యలో భారీగా తేడా ఉందని ఆయన విమర్శించాడు.
ఒక్కో టెస్ట్ సిరీస్‌కు 120 పాయింట్లను ఐసీసీ కేటయించిందని ఆయన గుర్తు చేశాడు.ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక టెస్ట్ నెగ్గిన జట్టుకు 24 పాయింట్లు లభిస్తున్నాయి. కానీ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక టెస్టు నెగ్గితే ఆ జట్టు ఏకంగా 60 పాయింట్లు పొందడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించాడు.టెస్టులు కోల్పోతున్న జనాదరణను పెంచాలని ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టిందని,అయితే ఆ లక్ష్యం నెరవేరబోదని హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు.
అలాగే హోల్డింగ్ అభిప్రాయంతో ఏకీభవించిన ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ కూడా భవిష్యత్తులో ఈ ఛాంపియన్‌షిప్‌లో మార్పులు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నాడు.దీంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఒకే మ్యాచ్ ద్వారా నిర్ణయించడం కంటే బెస్ట్ ఆఫ్ త్రీ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయిస్తే బాగుండేదని వోక్స్ అభిప్రాయపడ్డాడు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 360 పాయింట్లు ఇండియా ఖాతాలో జమయ్యాయి.వచ్చే ఏడాది జూన్‌లో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లాండ్‌లోని క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో జరుగనుంది.