ఇంకో పది రోజుల్లో థియేటర్ల గేట్లు తెరుచుకోబోతున్నాయి. ఏ రాష్ట్రాలు ముందుగా అనుమతి ఇస్తాయనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. తెలంగాణలో మాత్రం అప్పుడే యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మిగిలిన స్టేట్స్ కి సంబంధించి కూడా ఇంకొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు అనుసరించాల్సిన 24 సూత్రాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అవి ఈ విధంగా ఉన్నాయి
1. ఆడిటోరియం ఆక్యుపెన్సీ 50 శాతానికి మించకూడదు
2. సీట్ల మధ్య తగినంత సామాజిక దూరం తప్పనిసరిగా ఉండాలి
3. వదిలేసిన సీట్లపై కూర్చోకూడదని స్పష్టంగా మార్క్ చేసి ఉంచాలి
4. హ్యాండ్ వాష్, శానిటైజర్లు ఏర్పాటు చేయాలి
5. ఆరోగ్య సేతు యాప్ విధిగా అందరూ వాడేలా చర్యలు తీసుకోవాలి
6. థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి. వైరస్ సూచనలు లేనివారిని మాత్రం లోపలికి పంపాలి
7. ఆరోగ్యానికి సంబంధించిన స్వీయ పర్యవేక్షణ, రిపోర్టింగ్ జరగాల
8. స్క్రీన్లు ఎక్కువగా ఉన్న చోట షో టైమింగ్స్ వేర్వేరుగా ప్లాన్ చేసుకోవాలి
9. డిజిటిల్ పేమెంట్స్ ని ప్రోత్సహించాలి
10. క్రమం తప్పకుండా క్లీనింగ్, డిస్ ఇన్ఫెక్షన్ చేయించాలి
11. బాక్సాఫీస్ వద్ద తగినన్ని కౌంటర్లు సిద్ధం చేయాలి
12. ఇంటర్వెల్ బ్రేక్ లో ఆడియన్స్ కదలికలను తగ్గించాలి
13. క్యూలైన్లు దూరం పాటించేలా ఫ్లోర్ మార్కింగ్ తప్పనిసరి
14. టికెట్ల అమ్మకాలు నిరంతరం సాగాలి, రద్దీ కాకుండా అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వాలి
15. ఉమ్మడాన్ని కఠినంగా నిషేధించాలి
16. శ్వాసకశ నియమాలు పాటించే తీరాలి
17. ప్యాక్ చేసిన తినుబండారాలు మాత్రమే అనుమతించాలి. లోపలికి డెలివరీ చేయకూడదు
18. ఫుడ్ అమ్మకాలకు ఎక్కువ కౌంటర్లు ఉండాలి
19. స్టాఫ్ శానిటైజేషన్ విధిగా జరగాలి. గ్లౌజులు, మాస్కులు, పిపిఈ కిట్లు, బూట్లు అందజేయాలి
20. వచ్చే ప్రతిఒక్కరి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి
21. బాక్సాఫిస్ కౌంటర్లు తగినన్ని ఉండాలి
22. కోవిడ్ 19 నియమావళికి వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు
23. ఎయిర్ కండీషనింగ్ టెంపరేచర్ 24-30 మధ్యలో మాత్రమే ఉండాలి
24. క్రమం తప్పకుండ ప్రజలను జాగ్రత్త పరిచేలా నిబంధనలను, సూచనలను పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా షోకు ముందు, బ్రేక్ లో, అయ్యాక గట్టిగా విన్పించేలా ఏర్పాట్లు చేసుకోవాలి
అన్నీ బాగున్నాయి కానీ ఇన్నేసి నియమాలు పాటించడం అంటే అంత సులభం కాదు. కార్పొరేట్ సంస్థలు నిర్వహించే మల్టీ ప్లెక్సులు తట్టుకోగలిగినా వ్యక్తులు నడిపే సింగల్ స్క్రీన్లు, థియేటర్లకు మాత్రం ఇది ఆర్థికంగా, అమలుపరిచే విధాన పరంగా చాలా పెద్ద సవాలే. అసలే సగం కెపాసిటీతో, ఏ సినిమాలు విడుదల అవుతాయో అర్థం కాని అయోమయంలో ఉన్న వీళ్ళకు ఇదో కఠిన పరీక్షగా మారనుంది. హౌస్ ఫుల్ అయ్యేంత సీన్ ఇప్పట్లో లేనప్పటికీ టికెట్ రేట్లు పెంచకుండా పైన చెప్పిన నిబంధనలు ఇంప్లిమెంట్ చేయడం కత్తి మీద సామే. వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. స్టార్ హీరోల సినిమాలు ఏవీ రిలీజ్ కు సిద్ధంగా లేవు. అందుకే అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నందుకు ఆనందించాలో లేక పరిస్థితి ఎలా ఉండబోతోందో ఊహించుకోవడానికి భయపడాలో అంతు చిక్కని వింత పరిస్థితి ఇది.