రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు చోటు దక్కుతుందా ..? దక్కితే ఏ శాఖ ఆయనకు కేటాయిస్తారు. అనే చర్చ నియోజకవర్గంలో ప్రారంభమైంది. జగన్ ఇచ్చిన హామీ మేరకు కొత్త కేబినెట్ లో చోటు లభిస్తుందని ఆర్కే అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. .
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రారంభం నుంచి కీలకంగా వ్యవహరించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే).. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి రెండో సారి గెలిచారు. గత ఎన్నికల సమయంలో, మంగళగిరిలో నిర్వహించిన వైఎస్సార్ సీపీ ప్రచార సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత జగన్.. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరి ఓటర్లు కూడా ఆర్కేను రెండోసారి గెలిపించి అసెంబ్లీకి పంపారు. ఆర్కే మంత్రి అవుతారని.. వ్యవసాయ శాఖ దక్కుతందని అందరూ ఆశించారు.
కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది. సామాజిక సమీకరణాలు, ఇతర ప్రాధాన్యాల దృష్ట్యా ఆర్కేకు కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే మొదటి విడతలో అవకాశం దక్కని వారికి.. రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందని జగన్ చెప్పారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు.. రెండో విడత కేబినెట్ విస్తరణలో ఆర్కే చోటు దక్కుతుందా లేదా అని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఆర్కే మాత్రం ఈ విషయంపై ఆచితూచి స్పందిస్తున్నారు. మంత్రి పదవి ఐదేళ్లపాటు నిర్వహించాలనే కాలపరమితి లేదని.. ఎప్పుడైనా మంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని.. తమ నాయకుడు చెప్పిన రెండున్నరేళ్ల ఫార్ములాను కోడ్ చేస్తున్నారు. బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటూ సమాధానమిస్తున్నారు.
లోకేశ్ పై విజయం..
వరుసగా మంగళగిరి నుంచి రెండు సార్లు గెలిచిన ఆర్కే.. గత ఎన్నికల్లో, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పై విజయం సాధించారు. 2014లో టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో స్వల్ప ఓట్లతో ఆర్కే గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థి నారా లోకేశ్ వేలల్లో ఆధిక్యం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత మంగళగిరి ప్రజలకు మరింత చేరువైన ఆర్కే.. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ‘పేదరికం కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న’… దివంగత వైఎస్సార్ స్ఫూర్తితో రాజన్న క్యాంటీన్ ద్వారా 4 రూపాయలకే భోజనం అందజేశారు. రాజన్న క్యాంటీన్ ద్వారా ప్రతిరోజూ 500 మంది ఆకలితీర్చారు. అలాగే తక్కువ ధరకే కూరగాయలు కూడా అందించారు.
ముమ్మరంగా అభివృద్ధి పనులు..
ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేశారు. మంగళగిరి మెయిన్ బజార్ లో ఇప్పటికే రోడ్ల విస్తరణ పనులు 50 శాతం పూర్తి చేసుకున్నాయి. ఇక మంగళగిరి-పరిమి రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దుగ్గిరాల-మంగళగిరి రోడ్డు విస్తరణ పనులకు కూడా శంకుస్థాపన జరిగింది. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం పార్కులు ఏర్పాటు చేశారు. మంగళగిరి నియోకజవర్గంలో ఏర్పాటైన ఎయిమ్స్ అభివృద్ధి కి కూడా ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఎయిమ్స్ కు వెళ్లే రోడ్డు మార్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. 250 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టు, 350 కోట్లతో అండర్ గ్రౌండ్ పనులకు డీపీఆర్ సిద్ధమయ్యాయని ఇటీవల ఎమ్మెల్యే మీడియాకు వెల్లడించారు. మంగళగిరి నృసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం 80 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధమైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఆర్కే కూడా హామీ…
మంగళగిరి ప్రజలకు 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చినట్లే .. ఆర్కే కూడా ఓ హామీ ఇచ్చారు. ‘ఈ సారికి తనని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయను అని చెప్పారు. అలాగే బీసీ అభ్యర్థిని పోటీలో ఉంచి అతడికి మద్దతు తెలుపుతానని’ మంగళగిరి ఓటర్లకు ఆర్కే ప్రామిస్ చేశారు.
మంగళగిరి పొలిటికల్ హిస్టరీ…
మంగళగిరి పాలిటిక్స్ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా విభిన్నం. రాష్ట్రమంతా వామపక్షాలు కలిసిపోటీ చేస్తే.. ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా ఉంటారు. అదేమంటే స్నేహపూర్వకపోటీ అంటూ సింపుల్ ఆన్సర్ ఇస్తారు. ఇక ఇక్కడ దేశంలో ఉన్న అన్ని పార్టీలకు నాయకులు మాత్రమే ఉంటారు…. కార్యకర్తలు, సంస్థాగత నిర్మాణం ఉండదు. నియోజకవర్గంలో ఎస్సీ ఓటింగ్ 50 వేల పైచిలుకు ఉండగా, పద్మశాలీయ, యాదవ, గౌడ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు.
మంగళగిరి నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే.. వైసీపీ రెండుసార్లు గెలిచింది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత పోటీ చేసిన రెండుసార్లు విజయం సాధించడం విశేషం.1983లో మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీనటి జమున పోటీ చేసి .. టీడీపీ అభ్యర్థి MSS కోటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ‘చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడా..‘ గేయ రచయిత వేములపల్లి శ్రీకృష్ణ ఇక్కడి నుంచి రెండు సార్లు అసెంబ్లీకిప్రాతినిధ్యం వహించారు. శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించారు. ఆయన విశాలాంధ్ర ఎడిటర్ గా కూడా పనిచేశారు.
1983, 1985లో టీడీపీ అభ్యర్థి MSS కోటేశ్వరరావు విజయం సాధించారు. 1985లో గెలిచిన తర్వాత ఎన్టీఆర్ కేబినెట్ లో చోటు దక్కించుకుని ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు విజయం సాధించింది. 1999, 2004లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన మురుగుడు హనమంతరావు కూడా మంత్రిగా పనిచేశారు.
మీకు తెలుసా ఈ విషయాలు.. ?
మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామరావు, 1947లో మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఆ తర్వాత సినీరంగంలోకి ప్రవేశించారు. 1982లో టీడీపీ ని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రాజకీయాల్లోనూ రికార్డు సృష్టించారు. మంగళగిరి సమీపంలోని దుగ్గిరాల సినీనటి జమున స్వస్థలం. ఆమె 1985 ఎన్నికల్లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. మెగాస్టార్ చిరంజీవి మంగళగిరిలో ఆరో తరగతి చదివారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు అప్పట్లో ప్రొహిబిషన్ కార్యాలయంలో పనిచేసేవారు.