ఈ నెల 4వ తేదీ తమిళంలో మండేలా సినిమా డిస్ట్రిబ్యూషన్ వివాదాల వల్ల నేరుగా టీవీ ప్రీమియర్ ద్వారా రిలీజయ్యింది, నల్లగా భారీకాయంతో కామెడీగా కనిపించే యోగిబాబు హీరో కావడంతో పెద్దగా అంచనాలు లేవు. అందులోనూ ఇటీవలి కాలంలో ఇతన్ని హీరోగా పెట్టి చాలా సినిమాలు తీశారు కానీ ఒకటి రెండు తప్ప ఏవీ అంతగా వర్కౌట్ కాలేదు. కానీ అనూహ్యంగా మండేలా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూసినవాళ్లను సర్ప్రైజ్ చేసింది. థియేటర్లలో వచ్చి ఉంటే ఇంకా గట్టిగా ఆడేది. ఇటీవలే దీన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. మరి అంతగా ఈ మూవీలో ఏముందో రిపోర్ట్ లో చూసేద్దాం
తమిళనాడులో ఓ మారుమూల పల్లెటూరు. వెయ్యి మంది ఓట్లర్లున్న గ్రామం. అయినా కూడా అక్కడ వర్గ పోరు నడుస్తూ ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఊరిని విభజించి ఆధిపత్యం కోసం తరచు గొడవలు పడుతూ ఉంటారు. మధ్యలో ఓ చెట్టు కింద మంగలి షాపు నడుపుతూ ఉంటాడు స్మైల్ అలియాస్ మండేలా(యోగిబాబు). ఎవరు ఎంత అవమానించినా స్వంతంగా సెలూన్ పెట్టుకోవడం కోసం అన్నింటిని భరిస్తూ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఊరికి ఎన్నికలు వస్తాయి. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు మండేలా ఎవరికి ఓటేస్తే వాళ్లే ఊరికి ప్రెసిడెంట్.
దర్శకుడు మడొన్నే అశ్విన్ కు ఇది మొదటి సినిమా. అయినా కూడా ఎక్కడా తొణక్కుండా చాలా సున్నితమైన సమస్యను రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. రెండున్నర గంటలు మొత్తం ఆ ఊరి సింగల్ లొకేషన్లోనే జరుగుతుంది. అయినా ఎక్కడా విసుగు రాదు. దానికి తోడు ఆర్టిస్టుల సహజమైన పెర్ఫార్మన్స్ మండేలా స్థాయిని పెంచాయి. యోగిబాబు చెలరేగిపోయాడు. తనను పూర్తిగా వాడుకుని బెస్ట్ యాక్టర్ ని బయటికి తీశాడు అశ్విన్. ఇలాంటి సమకాలీన అంశాలు తెలుగులో వర్కౌట్ కావు కానీ ఒరిజినల్ వెర్షన్ మాత్రం మనల్ని కూడా మెప్పిస్తుంది. కావాలంటే ట్రై చేయండి. మండేలా నవ్వించడమే కాదు ఆలోచింపజేస్తాడు కూడా.