ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మానవ బాంబుగా మారి చంపేస్తానని, ట్విట్టర్లో పోస్టులు చేసిన యువకుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు ఫోటోను ట్విట్టర్ అకౌంట్ కి డిస్ప్లే పిక్ పెట్టుకున్న కన్నాభాయ్ అనే ఒక యూజర్ జగన్ ను చంపుతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా రెమ్యునరేషన్ లో సగం అంటే పాతిక కోట్లు నాకే ఇస్తే నా కుటుంబాన్ని, జీవితాన్ని వదిలేసి మానవ బాంబై, జగన్ ను నేనే లేపేస్తా, పేగులు మెడలో వేసుకుని తిరుగుతా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోతా అని రాసుకొచ్చాడు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల ఫిర్యాదులు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న సీఐడీ పోలీసులు అతనిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. తాజాగా ఈ కేసు వివరాలను సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ రాధిక మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన రాజుపాలెం ఫణి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడని,ట్విట్టర్ లో పెట్టిన పోస్టుపై తమకు ఫిర్యాదు అందిందని తెలిసిన వెంటనే ఆ పోస్టులను ఫణి డిలీట్ చేయడంతో పాటు ట్విట్టర్ అకౌంట్ మూసేశాడని పేర్కొన్నారు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసేసి.. ఆఫీస్‌కు సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాడని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇక విచారణలో ఫణి తాను జనసేన పార్టీకి మద్దతు దారునని, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానినని చెప్పినట్టు ఎస్పీ తెలిపారు.
అలాగే, సదరు వ్యక్తి ట్విట్టర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పోస్టులు చేస్తుంటారని గుర్తించామని ఆమె అన్నారు. గతంలో మాదిరిగా వీపీఎన్ మార్చుకుని, అకౌంట్ డియాక్టివేట్ చేసుకుంటే దొరకరని అనుకుంటే ఇబ్బందే అని, ఇలాంటి పోస్టులు ఎవరి గురించి చేసినా, ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ట్రేస్ చేసేలా ఆధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ వెల్లడించారు. రాజకీయ విమర్శలు పర్లేదు కానీ ఇలా రెచ్చిపోయి చంపుతా అనే మాటలు మాట్లాడడం సరికాదు.