బెంగాల్ సీఎం ఇప్పుడు త్రిపురపై కన్నేశారు. 2024 నాటికి జాతీయ రాజకీయాల్లో తనది కీలకపాత్ర కావాలని ఆమె ఆశిస్తున్నారు. మోడీ వ్యతిరేక శక్తులకు తానే కేంద్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో సాధించిన విజయం ఆమె ఆశలు చిగురించడానికి తోడ్పడింది. దాంతో ఇప్పుడు త్రిపుర తలుపులు తట్టడానికి సిద్ధమవుతున్నారు. బెంగాల్ లో బీజేపీ విజయాన్ని అడ్డుకున్న మమతా, ఇక ఇప్పుడు త్రిపురలో ఆపార్టీని ఓడించాలనే కంకణం కట్టుకున్నారు. దానికి అనుగుణంగా త్రిపుర రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ హవా ప్రారంభించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. తద్వారా ఢిల్లీలో చక్రం తిప్పడానికి తన సత్తా చాటుకోవడం సులవవుతుందని ఆమె అంచనా వేస్తున్నారు.
త్రిపురలో సుదీర్ఘకాలం తర్వాత 2018లో వామపక్ష కూటమికి ఓటమి ఎదురయ్యింది. నిజాయితీపరుడైన నిబద్ధత కలిగిన నేత మాణిక్ సర్కార్ ఓటమి పాలయ్యారు. దానికి అనేక కారణాలున్నప్పటికీ లెఫ్ట్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడంతో త్రిపుర రాజకీయాల్లో పెను మార్పులకు మూలమయ్యింది. 60 సీట్లున్న అసెంబ్లీలో ఎన్డీయే పాగా వేయడంతో విప్లవ్ దేవ్ వర్మ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. 2023 ప్రారంభంలో తదుపరి ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాదిన్నరలో జరగబోతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ముందు కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర తీర్పు ప్రభావం ఉంటుంది. అదే సమయంలో బీజేపీని ఓడించి, గద్దె దింపగలిగితే ఇక హస్తిన వైపు పయనం మమతా బెనర్జీకి మార్గం సుగమం చేస్తుంది.
వాస్తవానికి మూడు దశాబ్దాల పాటు త్రిపురలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు నడిచాయి. కానీ అసోంలో అధికారం దక్కించుకున్న తర్వాత ఆర్ఎస్ఎస్ అండతో త్రిపురలో కాంగ్రెస్ మూలాలను బీజేపీ కాజేసింది. ఇక 20 శాతం ఉన్న గిరిజనుల్లో గట్టి పట్టున్న ఐపీఎఫ్ టీతో జట్టుగట్టి సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించగలిగింది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ఆ రాష్ట్రంమీద కన్నేసి బీజేపీ నుంచి మళ్ళీ టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్ కి సమన్వయం బాధ్యతను అప్పగించింది. ఇక సీపీఎం నుంచి టీఎంసీలో చేరిన మాజీ ఎంపీ రితుబ్రత బెనర్జీని ఇన్ఛార్జ్ గా నియమించింది. వాటితో పాటుగా సుమారు 40 శాతం బెంగాలీలున్న రాష్ట్రంలో తాను పాగా వేసేందుకు ఎక్కువ వీలుంటుందని భావిస్తున్న మమతా ఆపరేషన్ త్రిపుర ప్రారంభించి ముందుకెళుతున్నారు.
కాంగ్రెస్ తోపాటుగా బీజేపీలో అసంతృప్తులను కూడా టీఎంసీ వైపు మళ్లించడంలో ఆపార్టీ విజయవంతం అవుతోంది. బీజేపీలోనే సీఎం పట్ల తీవ్ర అసమ్మతి ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఢిల్లీ వెళ్లి అధిష్టానం వద్ద సీఎం మీద ఫిర్యాదులు చేశారు. బీజేపీ అధిష్టానం నుంచి దూత వచ్చిన సమయంలో సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో బీజేపీలో అనైక్యతను, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని మమతా బెనర్జీ ఆలోచిస్తున్నారు. అదే సమయంలో త్రిపుర గిరిజన ప్రాంతాల్లో ఐపీఎఫ్ టీ కి వ్యతిరేకంగా మాజీ కాంగ్రెస్ నేత సారధ్యంలో వచ్చిన కొత్త కూటమిని కలుపుకుని పోయేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం అనేక అవకాశాలున్న సమయంలో బెంగాల్ రాజకీయాల ప్రభావంతో తాము పాగా వేయడం సులువు అవుతుందని టీఎంసీ భావిస్తోంది. దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది.
అదే సమయంలో త్రిపుర ప్రభుత్వం ప్రజావ్యతిరేకత నుంచి గట్టెక్కేందుకు గట్టిగానే శ్రమిస్తోంది. ముఖ్యమంత్రి తీరు పట్ల వ్యతిరేకత ఉన్న పార్టీ నేతలను బుజ్జగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సీపీఎం కూడా ఉద్యమాల జోరు పెంచింది. లెఫ్ట్, టీఎంసీ మధ్య ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలితే తాము గట్టెక్కగలమని బీజేపీ ఆశిస్తోంది. అయితే టీఎంసీ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ తమ పునాదులు కాపాడుకుంటే మళ్లీ పుంజుకోలమని వామపక్షాలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిపుర రాజకీయాలు ఆసక్తగా మారుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో తాను ప్రధానమంత్రి పదవికి కూడా పోటీలో ఉండాలని కోరుకుంటున్న మమతా బెనర్జీకి త్రిపుర వంటి రాష్ట్రం కూడా చేజిక్కితే ఆమె అవకాశాలు మరింత మెరుగుపడతాయనడంలో సందేహం లేదు. అందుకే ఆమె త్రిపుర మీద ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె ఆశలపై త్రిపుర ప్రజలు నీళ్లు జల్లుతారా లేక నిజం చేస్తారా అన్నది చూడాలి.