మరో రెండేళ్లలో జరగబోయే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆ దిశగానే సాగబోతున్నాయి. మూడో ప్రత్యామ్నాయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికలను అందుకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. ఓ వైపు ఇతర రాష్ట్రాలలో బలపడే ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న దీదీ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న మాదిరిగా.. దీదీ అడుగులు వేస్తున్నారు. బీజేపీపై కత్తి దువ్వుతున్న దీదీ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని కోరుకుంటున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ గెలిస్తే.. అది 2024 ఎన్నికలకు ఉపయుక్తమని బీజేపీ భావిస్తోంది. అందుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ దూకుడుకు ఉత్తరప్రదేశ్‌లో అడ్డుకట్ట వేస్తే.. మమతా మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు మరింత వేగవంతమవుతుంది. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, బయట నుంచి సమాజ్‌వాదీ పార్టీకి మద్ధతు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన దీదీ.. తాజాగా సమాజ్‌వాదీ పార్టీకి మద్ధతుగా ప్రచారం కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే నెల 8వ తేదీన లక్నోలో వర్చువల్ ర్యాలీ నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించింది. ఈ ర్యాలీలో ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తోపాటు మమతా కూడా పాల్గొననున్నారు. ఆ ర్యాలీ తర్వాత.. మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో కూడా ఇద్దరు నేతలు కలసి ఎన్నికల ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ధృవీకరించారు. మమతాతో భేటీ అయిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించడంతో.. ఉత్తరప్రదేశ్‌లో దీదీ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది.
403 అసెంబ్లీ సీట్లు గల ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ నోటిఫికేషన్ ఈ నెల 14వ తేదీన వెలువడింది. మార్చి 7వ తేదీన చివరిదైన ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసన సభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.