తూర్పుగోదావరి జిల్లా రహదారులు నెత్తురోడాయి. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి కొండపైనుండి కింద పడిపోవడంతో ఆరుగురు మృతి చెందగా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తున్న బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండపైనుండి కింద పడిపోయింది. వ్యాన్ లో 22 మంది ప్రయనిస్తున్నట్లుగా సమాచారం. కాగా ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.మృతులు క్షతగాత్రులంతా గోకవరం మండలం ఠాకుర్పాలెంకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వ్యాన్ నుండి బయటకు తీసి దగ్గరలో ఉన్న గోకవరం మరియు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.