కరోనా లాక్ డౌన్ వల్ల పది నెలల దాకా సుదీర్ఘ విరామం తీసుకున్న టాలీవుడ్ గత రెండు నెలలుగా షూటింగులతో యమా సందడిగా మారింది. స్టూడియోలు కళకళలాడుతున్నాయి. థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. జనం సాధారణ స్థితికి వచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎడాపెడా రిలీజు ప్రకటనలు కూడా వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల షూట్లలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఫైనల్ గా అందరూ సెట్లలో అడుగు పెట్టేశారు. ఇప్పటిదాకా వెయిటింగ్ లో ఉన్న మహేష్ బాబు సైతం దుబాయ్ లో తన సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ని ఇవాళ నుంచే స్టార్ట్ చేశారు. మైత్రి నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో మహేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ ని కూడా మార్చుకుని మాస్ లుక్ ని తెచ్చుకున్నారు. మైత్రి-14 రీల్స్ తో పాటు మహేష్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్న సర్కారు వారి పాట ఈ షెడ్యూల్ అయ్యాక అమెరికా వెళ్లనుంది. అక్కడ ఏదైనా ఆలస్యం జరిగేలా ఉంటే ముందు హైదరాబాద్ పార్ట్ పూర్తి చేస్తారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు.
ఇదిలా ఉండగా ఈ రోజే పవన్ కళ్యాణ్ రానా కాంబోలో రూపొందుతున్న అయ్యప్పనుం కోశియం రీమేక్ కూడా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. వకీల్ సాబ్ పూర్తయ్యాక క్రిష్ మూవీతో పాటు దీన్ని కూడా పవన్ పారలల్ గా ఫినిష్ చేయబోతున్నాడు. విడుదల మాత్రం ఇదే ముందు ఉంటుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగులు అందిస్తున్న ఈ సినిమాకు బిల్లారంగా టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. ఇలా టాలీవుడ్ అగ్రే హీరోలిద్దరూ ఒకేరోజు క్రేజీ ప్రాజెక్టుల రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోవడం కన్నా హ్యాపీ న్యూస్ ఇంకేముంటుంది.